దిశ చట్టంతోనూ... జగన్ కు మంచి మార్కులు
విజయవాడ, డిసెంబర్ 12,
ఈకంత పనిచేసి.. పీకంత చెప్పుకొనే రోజులు ఇవి! కొన్నికొన్ని సార్లు అసలు చేయకపోయినా.. ఇచ్చిన హామీలనే వల్లెవేసే రోజుల్లో ఉన్నాం. ఇది రాజకీయాల్లో కామన్ అయిపోయింది. పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు చెబుతున్న దానికీ చేస్తున్న దానికి కూడా సంబంధం లేకపోయినా.. అది చేశాం.. ఇది చేశాం.. అని చెప్పుకొని పబ్బం గడుపుకొంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే, ఏమీ చెప్పకపోయినా.. ఎంతో చేస్తున్నా.. కనీసం ప్రచారం చేసుకునేందుకు కూడా ఏపీ సీఎం జగన్ ముందుకు రావడం లేదని అంటోంది జాతీయ మీడియా.తాజాగా మంగళవారం నాటి జాతీయ ఆంగ్ల మీడియా పత్రికలు రెండు విషయాలను ప్రముఖంగా ప్రస్థావించాయి. వీటిలో ఒకటి దేశాన్ని కుదిపేస్తున్న ఉల్లిపాయల విషయం. రెండు మహిళలకు భద్రత. ఈ రెండు విషయాలు కూడా ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే, దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రెండు అంశాలను సీరియస్‌గా తీసుకోవడం లేదని ఒక్క ఏపీ తప్ప అని జాతీయ మీడియా రాయడం గమనార్హం.నిజానికి ఇటీవల కాలంలో గడిచిన ఆరుమాసాల జగన్ పాలనను బేరీజు వేసుకుని జాతీయ మీడియా అనేక కథనాలు, ఎడిటోరియళ్లు రాసింది. ముఖ్యంగా పీపీఏలు, పోలవరం రివర్స్ టెండర్లు, అమరావతి రాజధాని విషయంలో ఆయన వెనక్కి తగ్గుతున్న వైనం, పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోవడం వంటి అంశాలను తీవ్రంగా తప్పుబడుతూ.. అనేక కథనాలు వచ్చాయి. వీటిని టీడీపీ అనుకూల మీడియా కూడా ప్రచురించింది.ఇక, ఇప్పుడు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో ఉల్లిపాయలను ప్రజలకు అందుబాటులో ఉంచడమే కాకుండా కిలో రూ.25కే ఇవ్వడం ఇప్పుడున్న పరిస్థితిలో జాతీయ రికార్డేనని జాతీయ మీడియా జగన్ పాలనను ఆకాశానికి ఎత్తేసింది. అంతేకాదు, దీనిని రైతు బజార్లలో అందుబాటులో ఉంచడాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. అదే సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలైన హరియాణా, యూపీ, కర్ణాటకల్లోనూ ఉల్లిపాయల సమస్యను అక్కడి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించింది.అదే సమయంలో హైదరాబాద్‌లో దిశ ఘటన తర్వాత ఇలాంటి ఘటనలు ఏపీలో జరిగితే తీసుకునే చర్యల విషయంలోనూ జగన్ ముందు చూపుకు మంచి మార్కులు వేసింది. ఇక్కడ జీరో ఎఫ్ ఐఆర్‌ను అమలు చేయడం కూడా దేశంలో ప్రప్రథమమని కొనియాడింది. మొత్తానికి జాతీయ మీడియా ముందు మనోళ్లు మరోసారి చతికిల పడ్డారా? అనే సందేహం కలిగించింది. చివరికి జగన్ మీడియాలోనూ ఇలాంటివి హైలెట్ కాకపోవడం గమనార్హం.