ఇక ఆన్ లైన్ లో ఇసుక
ఖమ్మం, డిసెంబర్ 12,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 ప్రాంతాల్లో మన ఇసుక వాహనంతో ఆన్‌లైన్‌లో బుకింగ్ ద్వారా ఇసుక సరఫరాకు ప్రభుత్వం అనుమతించింది. ప్రసుత్తం 6 ప్రాంతాల నుంచి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. మన ఇసుక వాహనం పేరిట..జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయడంతో..ఈ బండి ఇసుక రీచ్ నుంచి బయల్దేరాక ఎక్కడ ఉంది? ఎటు వెళ్తుంది? అనేది అధికారులకు తెలుస్తుంది. బుక్ చేసుకున్న వినియోగదారుడి ఇంటికి వెళ్లి లోడ్ దించాక..తనకు ఇసుక అందిందని ఆన్‌లైన్‌లో సమాచారమిస్తేనే ఆ ట్రాక్టర్‌కు కిరాయి వస్తుంది.ఇసుకను తరలించే ట్రాక్టర్‌కు కిలోమీటరుకు రూ.80 చొప్పున ప్రభుత్వం కిరాయి అందిస్తుంది. స్యాండ్ ర్యాంపు నుంచి 50, 60 కిలోమీటర్ల పరిధి వరకు సరఫరా చేసుకునే వీలుంది. ప్రతిరోజూ ఒక్కో ట్రాక్టర్‌కు అన్నిఖర్చులు పోనూ రూ.3వేల వరకు ఆదాయం వస్తుంది. ఇసుక రీచ్‌లు ఉన్న గ్రామ పంచాయతీలకు ఒక్కో ట్రిప్పుకు రూ.300 వస్తాయి. మరమ్మతులకు ట్రిప్పుకు రూ.100 కేటాయిస్తున్నారు. ఇసుకను ట్రాక్టర్లలో నింపేందుకు స్థానికంగా ఉన్న కూలీలకు కూడా ఉపాధి లభిస్తోంది. ఆన్‌లైన్ ప్రక్రియతో అక్రమాలు చోటు చేసుకోకుండా కట్టడి చేసే అవకాశాలు ఉన్నాయి. 18,091ట్రిప్పులు బుక్ కావడంతో మరికొన్ని పంచాయతీల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.