ఆర్టీసీలో 9 శాతం పడిపోయిన ఓఆర్
హైద్రాబాద్, డిసెంబర్ 12,
ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు. సమ్మెకు ముందు 70 శాతానికి పైగా ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) ఉండగా, ప్రస్తుతం 60 శాతం కూడా దాటడం లేదు. సమ్మె సందర్భంగా జనం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవడం, వాటికే అలవాటు పడటంతో పాటు ఇటీవల టికెట్ల రేట్లు పెరగడం కూడా దీనికి కారణమే. అయితే చార్జీలు పెంచడంతో ప్యాసింజర్స్ సంఖ్య తగ్గినా ఆర్టీసీ ఆదాయం మాత్రం పెరిగింది.ఆర్టీసీ కార్మికులు 52 రోజులు సమ్మె చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు పూర్తిస్థాయిలో రోడ్డెక్కలేదు. దీంతో జనం సొంత బండ్లపై వెళ్లడం, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడం, మెట్రో, ఎంఎంటీఎస్‌లో ప్రయాణం, క్యాబ్‌లు, కార్‌పూలింగ్‌లను ఎక్కువగా వాడారు. రోజుల తరబడి సమ్మె జరగడంతో ప్రజలు వాటికి అలవాటు పడ్డారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో బస్సులు రోడ్డెక్కినా ఎక్కేందుకు ఆసక్తి చూపించడంలేదు. సమ్మె ప్రారంభానికి ముందు సగటున రోజు 37.3 లక్షల కిలోమీటర్లు బస్సులు తిరిగితే, 70.2 శాతం ఓఆర్ నమోదైంది. సమ్మె తర్వాత ఈ నెల ఇప్పటిదాకా సగటున రోజుకు 34.1 లక్షల కిలోమీటర్లు తిరగ్గా, 61.7 శాతం ఓఆర్ రికార్డయ్యింది. 9 శాతం ఓఆర్ తగ్గింది.ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలకు అలవాటుపడటమే కాక ఓఆర్ తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. సమ్మె కాలంలో రిపేర్‌కు వచ్చిన బస్సులు సుమారు 500 వరకు ఉన్నాయి. ఇక సిటీలో వెయ్యి బస్సుల దాకా నడపడంలేదు. సమయానికి బస్సులు రాక.. ఎక్కువ దూరం వెళ్లేవారు గంటల తరబడి వెయిట్ చేయలేక ప్రత్యామ్నాయ మార్గాల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. టికెట్ ఛార్జీల పెంపు కూడా ముఖ్య కారణమని, కిలోమీటర్‌కు 20 పైసలు పెంచామని చెబుతున్నా.. రౌండ్ ఫిగర్ పేరుతో పెంపు భారీగానే అయిందని చాలా మంది అంటున్నారు. పెరిగిన ధరలతో బస్సులో వెళ్లడం కంటే అదే రేటుకు మెట్రోలో వెళ్లడం బెటరని భావిస్తున్నారు. ఉదాహరణకు.. మెట్రోలో ఎల్బీనగర్ నుంచి ఖైరతాబాద్‌కు రూ.40 ఉండగా, పెరిగిన ధర ప్రకారం బస్సులో రూ. 30 తీసుకుంటున్నారు. దీంతో ఏసీలో, ట్రాఫిక్ జామ్ లేకుండా మెట్రోలో ప్రయాణించడం మంచిదని ప్రయాణికులు భావిస్తున్నారు. సమ్మె సమయంలో సర్కార్ పర్మిట్ల నిబంధనలను సడలించడంతో గ్రామాల్లోనూ చాలా మంది ప్రైవేట్ వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. వీటిని నియంత్రించడంతో పాటు పక్కన పెట్టిన బస్సులను జిల్లాల్లో నడిపితే ఓఆర్ పెరగడంతోపాటు, మస్తు ఆదాయం వస్తుందని యూనియన్ల నేతలు అంటున్నారు.ఓఆర్ తగ్గినా ఆర్టీసీ ఆదాయం మాత్రం పెరిగింది. సమ్మెకు ముందు ఆర్టీసీకి రోజుకు సగటున రూ.10.1 కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుతం రోజుకు రూ.11.3 కోట్ల ఇన్‌కమ్ వస్తోంది. అంటే రూ.1.2 కోట్ల ఆదాయం పెరిగింది. స్ట్రైక్ కు ముందు ఎర్నింగ్ ఫర్ కిలోమీటర్(ఈపీకే) రూ.28.70 ఉండగా, ఇప్పుడు రూ.32.64 నమోదవుతోంది. ఇక ఎర్నింగ్ ఫర్ బస్ రూ.9,580 ఉండగా, ఇప్పుడు రూ.10,802 వస్తోంది. టికెట్ ఛార్జీలు పెరగడంతో ప్రయాణికులు తగ్గినా ఆదాయం ఎక్కువ సమకూరుతోంది