దిశ నిందితుల ఎన్కౌంటర్.. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం
వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ విచారణ
విచారణ ప్రారంభించిన తేదీ నుంచి ఆరు నెలల్లోగా నివేదిక
న్యూఢిల్లీ డిసెంబర్ 12,
'దిశ' నిందితుల ఎన్ కౌంటర్ పై అభ్యంతరాలు తెలుపుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై వాదనలు ముగిశాయి. నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ కమిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఎన్కౌంటర్పై విచారణకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ఆదేశించారు. ఈ మేరకు సుప్రీం మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ను ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రసాద్ సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ ఉన్నారు. విచారణకు ఆరు నెలలు గడువు ఇచ్చింది. ఈ కమిషన్ కేవలం ఎన్కౌంటర్ పైనే విచారణ చేపట్టనుంది. దిశ ఎన్కౌంటర్పై అన్నికోర్టులలో దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు స్టే విధించింది. త్రిసభ్య కమిషన్ ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. తెలంగాణ ప్రభుత్ తరఫున మాజీ అడ్వకేట్ జనరల్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కమిషన్ ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్కౌంటర్ వెనక ఎలాంటి దురుద్దేశం లేదని కోర్టుకు తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు ఉన్నతాధికారులతోనూ ఎన్ కౌంటర్ పై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే సీజేఐ బాబ్డే.. ఈ వాదనలను అంగీకరించలేదు. దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాల్సిందేనని భావించిన సుప్రీంకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విచారణ విశ్వసనీయతకు సంబంధించిన అంశమని తెలిపింది. సుప్రీం కోర్టు గైడ్లైన్స్ను పాటించారని నివేదించారు. గంటకు పైగా విచారణ జరిగింది. నిజానిజాలు ప్రజలకు తెలియాల్సి ఉందని.. ఎన్కౌంటర్ జరిగిన తీరుపై అనుమానాలు తొలగించాల్సిన అవసరం ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు.