బంగ్లాదేశ్ మంత్రి పర్యటన రద్దు
న్యూఢిల్లీ, డిసెంబర్ 12,
భారత్ తీసుకొస్తున్న పౌరసత్వ సవరణ బిల్లుకు నిరసనగా.. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్ ఇండియా పర్యటనను రద్దు చేసుకున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు వల్ల భారత లౌకిక వాదం బలహీనపడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశంలో మైనార్టీలు మతపరమైన వివక్షను ఎదుర్కొంటున్నారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. సోమవారం రాత్రి లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ బిల్లు.. బుధవారం రాత్రి రాజ్య సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.ఈ బిల్లు ప్రకారం 2014, డిసెంబర్ 31లోగా భారత్‌కు శరణార్థులుగా వచ్చిన పాకిస్థాన్, బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్ దేశాలకు చెందిన హిందు, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శీ, క్రైస్తవులకు భారత పౌరసత్వం ఇస్తారు. ఈ మూడు దేశాల్లో మత వివక్షను ఎదుర్కొని భారత్ వచ్చిన ముస్లిమేతరులను అక్రమ వలసదారులుగా గుర్తించరు.ఈ బిల్లు ప్రభావం భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని బంగ్లా విదేశాంగ మంత్రి అబ్దుల్ మొమెన్ అభిప్రాయపడ్డారు. అసోంలో చేపట్టిన ఎన్ఆర్సీలో 19 లక్షల మందిని మినహాయించారు. వీరిని దేశం నుంచి బయటకు పంపిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. వీరిని ఏ దేశానికి తిరిగి పంపిస్తారనేది చెప్పనప్పటికీ.. వారంతా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారేనని భావిస్తున్నారు.గత అక్టోబర్‌లో బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన సందర్భంగా.. ఎన్ఆర్సీసీ అంశంపై మాట్లాడారు. ఎన్ఆర్సీసీ అనేది భారత్ అంతర్గత వ్యవహారమని కేంద్రం తెలిపింది.భారత్, బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుతం సన్నిహిత స్నేహ సంబంధాలు ఉన్నాయన్న బంగ్లా విదేశాంగ మంత్రి.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. కాబట్టి.. తమను ఆందోళనకు గురి చేసే ఏ పనిని కూడా భారత్ చేయొద్దని బంగ్లాదేశీయులు సహజంగానే కోరుకుంటారన్నారు.బంగ్లాదేశ్‌లో హిందువులను వేధిస్తున్నారన్న భారత హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను మొమెన్ ఖండించారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నిజం కాదన్నారు. మా దేశంలో మైనార్టీలెవరూ లేరు.. అంతా సమానమే అన్నారు. బంగ్లాలో ఉన్నంతగా మత సామరస్యం ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాత్రమే ఉంటుందన్నారు. అమిత్ షా కొన్నాళ్లు బంగ్లాదేశ్‌లో ఉంటే.. మా దగ్గరున్న మతసామరస్యాన్ని చూడొచ్చన్నారు.దక్షిణాసియాలో భారత్‌కు అత్యంత సన్నిహిత దేశం బంగ్లాదేశ్. అలాంటిది తమకు ఆందోళన కలిగించేలా.. ఎన్‌ఆర్సీ, పౌరసత్వ బిల్లు లాంటి నిర్ణయాలను భారత్ ఎందుకు తీసుకుంటుందో అర్థం కావడం లేదని బంగ్లాదేశ్ దౌత్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే.. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించే అవకాశం ఉందనే భావన వ్యక్తం అవుతోంది.