జాతీయ జల విధానాన్ని సవరించనున్న కేంద్రం
లోక్ సభలో నెల్లూరు ఎంపీ ఆదాలకు తెలిపిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ డిసెంబర్ 12
ప్రస్తుత దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2012 జాతీయ జల విధానాన్ని సవరించనున్నట్లు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి రతన్ లాల్ కటారియా తెలిపారు. జాతీయ జల విధానాన్ని సవరించే ప్రతిపాదన ఏదైనా ఉందా?, ఒకవేళ ఉంటే ఆంధ్ర ప్రదేశ్ అవసరాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? అని నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి గురువారం లోక్ సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ ప్రస్తుత దేశ అవసరాలు పెరిగిపోయాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని విధానాన్ని మార్చాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. అందువల్లనే నవంబర్ 5వ తేదీన ఈ మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం పూర్తి అయ్యాక ఒక సమగ్ర విధానం రూపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.