పాఠశాలల్లో మౌళిక వసతులు
ఒంగోలు, డిసెంబర్ 12,
భావితరాలకు ఉపయోగపడేలా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ చెప్పారు. మనబడి, నాడు—నేడులో భాగంగా జిల్లా స్ధాయి శిక్షణా కార్యక్రమం పాఠశాల తల్లిదంద్రుల కమిటి సభ్యులతో గురువారం స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించాలని కలెక్టర్ చెప్పారు. నాడు-నేడు కార్యక్రమం క్రింద జిల్లాలో 1255 పాఠశాలలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ఆయన వివరించారు. ప్రాధాన్యత క్రమంలో పాఠశాలకు మరమ్మతులు, అదనపు వసతులు కల్పించాలని ఆయన సూచించారు. గుత్తుదారుల వ్యవస్థకు దూరంగా అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని ఆయన చెప్పారు. తల్లిదండ్రుల కమిటి, పాఠశాల ప్రధానోపాధ్యాయలు, ఇంజనీర్లు కలిసి సమావేశం నిర్వహించాలని, పాఠశాలకు అవసరమైన వసతుల కల్పన పై కమిటి ఆమోదించిన అంశాలనే పరిగణలోనికి తీసుకోవాలని ఆయన వివరించారు. కమిటి తీర్మానం మేరకు చేపట్టాల్పిన పనులపై ఇంజనీర్లు కమిటి సభ్యులతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పనులు చేపట్టాలని, ప్రభుత్వ విధి విధానాలపై కమిటి సభ్యులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఇందుకోసం టి.సి.ఎస్.సంస్థ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, ప్రహరీ గడ, బోర్డు, ఫర్నీచర్, అదనపు గదులు, నిర్మాణం పై కమిటి దృష్టిసారించాలని కలెక్టర్ తెలిపారు. నాడు—నేడు కార్యక్రమాన్ని నాణ్యతాప్రమాణాలతో చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఇందుకోసం కమ్యూనిటి కాంట్రాకు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశా పెట్టిందని ఆయన వివరించారు. ఈ—ఆఫ్ లైన్ లో భాగంగా ప్రతి కమిటి తీర్మానించిన అంశాలు, ఆమోదించిన పనుల వివరాలు విధిగా ఆన్ లైన్ అప్లికేషన్ లో నిక్షిప్తం చేయాలని ఆయన సూచించారు. నాడు-నేడు కార్యక్రమం పై నిర్లక్ష్యం వుండరాదని ఆయన హెచ్చరించారు. పాఠశాల తల్లిదండ్రుల కమిటిలో 15 మంది సభ్యుల వుండాలని, ప్రతి వారం సమావేశాలు నిర్వహించి తీర్మానాలు అమలు చేయాలన్నారు. పదిమంది సభ్యులు హాజరై ఆమోదించిన అంశాలనే పరిగణలోనికి తీసుకోవాలని ఆయన చేప్పారు. రానున్న విద్యా సంవత్సరం నాటికి సమస్యలు లేని పాఠశాలలుగా రూపు రేఖలు మార్చాలని కలెక్టర్ దిశా నిర్ధేశం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వి.సుబ్బారావు, సర్వశిక్షా అభియాన్ ఇంజనీర్ ఏడుకొండలు, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ అనంద్ రెడ్డి, మున్నిపల్ ఇంజనీర్ సందరరామి రెడ్డి, ఎం.ఇ.ఓ.లు, పి.ఆర్., ఎస్.ఎస్.ఎ, మున్సిపల్, ఏ.పి.ఇ.డబ్యు.ఐ.డి.సి. ఇంజనీర్లు, సి.ఆర్.పి.లు. విద్యా సహాయకులు, తల్లిదండ్రుల కమిటి సభ్యులు పాల్గొన్నారు.