*ఎన్నో జన్మల పుణ్యం*
రాత్రి మట్టిలో నాటిన విత్తనం మూడోరోజు మొలకగా కనిపిస్తుంది. నల్లటి కారుమబ్బు వద్దన్నా జలజలా చినుకులు రాలుస్తుంది. ప్రకృతిలో ప్రతీది సహజంగా జరిగిపోయే ఏర్పాటు ఉంది. జీవితమూ అంతే. అది జీవించడానికే. జీవించడమే గొప్ప సాధన. సరిగ్గా జీవిస్తే మానవత్వం వెల్లివిరుస్తుంది. గొప్పగా జీవిస్తే దివ్యత్వం కనిపిస్తుంది.అష్టాంగ యోగ మార్గాలు, అష్టాదశ పురాణాల్లో మంచి విషయాలు దివ్యంగా జీవించే నరుడి ముందుకొచ్చి దర్శనం ఇస్తాయి.అందుకే యమ-నియమాలు ముందుగా చెప్పి తరవాత సాధనక్రమం అంతా చెబుతారు. మంచితనం లేనివాళ్లకు యోగం అబ్బదు. చెడ్డవాళ్లకు ఆలోచనలు అడ్డగించడం వల్ల ధ్యానం కుదరదు. పరిశుభ్రత లేనివారికి, ఆరోగ్యదాయకమైన యోగా అనుకూలపడదు. భక్తి లేనివారికి జ్ఞానం ఒంటపట్టదు.జీవించడంలో ఉండే మాధుర్యాన్ని ముందుగా తెలుసుకోవాలి. జీవన సౌందర్యంలో ఉండే తాత్వికతను గుర్తించాలి. జీవితం ఈశ్వర ప్రసాదం. భక్తిగా రెండు చేతులు పైకెత్తి దివ్యజీవనాన్ని ఆహ్వానించాలి. ఆటుపోట్లతో, హెచ్చుతగ్గులతో, సుఖ దుఃఖాలతో ఎలాంటి జీవితం వచ్చినా తలవంచుకుని అనుభవించాలి. నిజమైన సాధన ఇదే.ఊపిరి ఆపడం, భూమిలోకి దిగబడిపోవడం, ముళ్లమీద పడుకోవడం అభ్యాసం వల్ల వస్తాయి. నేల విడిచి సాము చేసినట్లు జీవితాన్ని గాలికి వదిలెయ్యకూడదు.జీవితంతో చక్కటి ప్రయాణం చేస్తే సాధన శిఖరాలకు చేరినట్లే. ఒక దీపం మరోదీపం వెలిగించినట్లు పదిమంది జీవితాల్లో కాంతిని నింపాలి. అంతకంటే మనిషికి సార్థకత లేదు. సాధన చేసి సత్యం తెలుసుకున్న మానవుడు చివరికి ఇలాంటి పనులకే పూనుకొంటాడు. పూనుకోవాలి.ఆధ్యాత్మిక జీవితం అనేటప్పటికి సాధనలమయం అనే భావన ఉంది. పుట్టుక నుంచి మరణం వరకు జరిగేది సాధనే. ఏం చేస్తున్నామో ఎరుకతో చేస్తే అంతా అద్భుతమైన సాధన. లేకపోతే బతుకే అయోమయం.పురుగు, పక్షి, పాము, చెట్టు... అన్నీ జీవిస్తున్నాయి. మరి మనమెందుకలా నేను అనేది లేకుండా హాయిగా జీవించలేకపోతున్నాం? బుద్ధి కలిగిఉండటం మనిషికి వరం, శాపం కూడా. నేను లేకుండా చేసుకుంటే బుద్ధి వరం. నేనును మేరుపర్వతమంత పెంచుకుంటే బుద్ధి శాపం.చిన్న ‘నేను’ నుంచి పెద్ద ‘నేను’ వరకు సాగే అతిపెద్ద జీవనమే అత్యంత అద్భుతమైన సాధన. చిన్న నేను అర్జునుడు. పెద్ద నేను శ్రీకృష్ణుడు. అతి పెద్ద జీవనం కురుక్షేత్ర యుద్ధం. అత్యంత అద్భుతమైన సాధన భగవద్గీత.శ్రీరాముడు జీవించాడు. మనిషిగా తన కర్తవ్యం నిర్వహించి, దేవుడిగా పేరు తెచ్చుకున్నాడు. జీవితం అవకాశం ఇస్తుంది. అంతే. దాన్ని సద్వినియోగపరుచుకోవాలి.కారణజన్ముడికైనా, అకారణ జన్ముడికైనా- బాధలు, కష్టాలు ఒకటే. విధిరాత మారదు. జీవితాన్ని భయపెట్టేవాడికి జీవితమే భయపడుతుంది. మనలో ఉండే అద్భుతమైన, అసాధారణమైన, అసామాన్యమైన గుణగణాలు చూసి లోకం మోకరిల్లుతుంది.పుట్టుకతోనే నోట్లో బంగారు చెంచాతో పుట్టినవాడినైనా జీవితం తడిగుడ్డ పిండినట్లు పిండక మానదు. ఇంతకంటే మహాసాధన ఉండదు.మానవుడిగా పుట్టడం, ప్రకృతితో కలిసి జీవించడం, సత్యానుభవం కోసం తహతహలాడటం... ఎన్నో జన్మల పుణ్యం. ఏ ఉపనిషత్తూ ఈ విషయాన్ని కాదనలేదు.