YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

16 నుంచి పసుపు రైతుల యాత్రలు నిజామాబాద్,

16 నుంచి పసుపు రైతుల యాత్రలు నిజామాబాద్,

16 నుంచి పసుపు రైతుల యాత్రలు
నిజామాబాద్, డిసెంబర్ 13,
పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధరపై ఎన్నికల హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. స్థానికంగా ఎంపీ మారితేనైనా తమ కష్టాలు తీరుతాయని భావించిన రైతులకు నిరాశే ఎదురైంది. మరో నెల రోజుల్లో పంట మార్కెట్‌కు పోటెత్తనుంది. సాధారణంగా అన్‌సీజన్‌లో పంట ధర అమాంతం పెరుగుతుంది. ఈ యేడాది మాత్రం పెరగలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో గరిష్ట ధర క్వింటాల్‌కు రూ.6 వేలు మాత్రమే పలుకుతుండగా.. పంట చేతికొచ్చే ఫిబ్రవరి నాటికి క్వింటా రూ.3 వేలకు పడిపోతుందేమోనన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది.నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో 11 మండలాలు సహా రూరల్‌ ప్రాంతంలోని జక్రాన్‌పల్లి, దర్పల్లి, సిరికొండ మండలాల్లో 38 వేల ఎకరాల్లో పసుపు సాగు చేశారు. ఆరు, తొమ్మిది నెలల కాలవ్యవధి పంటలు వేశారు. అందులోనూ 'ప్రతిభ' రకంతో పాటు ఇతర రకమూ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంటకు నీరు పట్టిస్తున్నారు. ఆ తరువాత పసుపు పంటను నేల నుంచి తీసి ఉడికిస్తారు. అనంతరం ఆరబెట్టి జనవరి మొదటి వారం నుంచి మార్కెట్‌కు తరలించనున్నారు. పసుపు రైతులు కనిష్టంగా రూ.50 వేల నుం చి గరిష్టంగా రూ.లక్ష వరకు నష్టపోయారు. ఒక్కో ఎకరం సాగుకు రూ.లక్షా 20 వేల నుంచి రూ. లక్షన్నర ఖర్చవ్వగా గతేడాది క్వింటాకు కనిష్టంగా రూ.4050 నుంచి గరిష్టంగా రూ.6,500 వరకు మాత్రమే ధర పలికింది. ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. సగటున క్వింటాకు రూ.5 వేల చొప్పున లెక్కేసినా ఒక్కో రైతు ఎకరాకు రూ.20 వేల చొప్పు న నష్టపోయారు. జిల్లాలో ప్రతి రైతూ సగటున రెండున్నర ఎకరాల నుంచి ఐదెకరాల వరకు సాగు చేస్తున్నారు. సాధా రణంగా అన్‌సీజన్‌లో పసుపు కొమ్ము ధర పెరగుతుంది. ఈ యేడాది ఈ సమయంలోనూ ధర పెరగలేదు. ప్రస్తుతం నిజామాబాద్‌ మార్కెట్‌లో ఫింగర్‌ రకం పసుపు కొమ్ముకు రూ.4027 నుంచి రూ.6017 వరకు మాత్రమే ఉంది. దశాబ్ద కాలంలో ఇదే అత్యంత తక్కువ ధర కావడం గమనార్హం. దీంతో పసుపు అన్‌సీజన్‌లోనే ఇంత తక్కువ ధర ఉంటే.. పంట మార్కెట్‌కు వచ్చిన తరువాత ఏ ధర వస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.నిజామాబాద్‌ ఎంపీ స్థానంలో బీజేపీని గెలిపిస్తే మద్ద తు ధరతో పాటు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న ఆ పార్టీ హామీ ఎన్నికల ప్రచారానికే పరిమితమైంది. బోర్డు ఏర్పాటు లో కొంత జాప్యమైనా.. కనీసం మద్దతు ధరపై కూడా కేంద్రం ఎలాంటి ప్రకటనా చేయలేదన్న ఆవేదనలో రైతాం గం ఉంది. బోర్డు అంశం రాజకీయ నిర్ణయమని ఇప్పటికే స్పేస్‌బోర్డు అధికారులు ప్రకటించారు. రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సిన బీజేపీ సర్కారు.. మీనమేషాలు లెక్కిస్తోంది. గతంలో టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత సైతం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. విజ్ఞాపనలు అందజేశారు. కానీ కేంద్రం ఆచరణలో ముందుకు కదల్లేదు. మళ్లీ అవే విజ్ఞాపనలు బీజేపీ ఎంపీ చేస్తున్నారని, దీనివల్ల ఏం లాభమని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇక పసుపు పంటలో కురుకుమిన్‌ శాతం పెంచేందుకు రైతులకు సాగు మెళకువలు నేర్పుతామని బీజేపీ ఎంపీ గతంలో ప్రకటించారు..పసుపునకు మద్దతు ధర రూ.15 వేలు కల్పించాలని, బోర్డు ఏర్పాటు చేయాలని రైతాంగం మరోసారి ఆందోళన బాటపట్టనుంది. ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలోని పలు మండలాల్లో ఆత్మగౌరవ యాత్ర పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఏ మండలం నుంచి యాత్ర ప్రారంభిస్తారనే అంశంపై 14వ తేదీన సమావేశమై ప్రకటిస్తామని రైతు నాయకులు చెబుతున్నారు. మొదట ఒక మండలంలోని అన్ని గ్రామాల్లో యాత్ర చేపట్టి బోర్డు కోసం రైతుల సంతకాలు సేకరించి, వారం వ్యవధి అనంతరం డివిజన్‌ మొత్తం యాత్ర చేపడతామని రైతు నాయకులు చెబుతున్నారు. పసుపు పంటకు క్వింటాకు రూ.15 వేలు ప్రకటించాలని, బోర్డు ఏర్పాటు చేయాలని గతేడాది రైతులు ఉద్యమాలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసమే లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ స్థానం నుంచి 178 మంది రైతులు నామినేషన్‌లు వేసి దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించిన విషయం విదితమే.

Related Posts