ప్లాస్టిక్ ఫ్రీ జాతరకు చర్యలు
ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువుల తయారీ అమ్మకందారులకు ప్రోత్సాహం
జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి
ములుగు, డిసెంబర్ 13
ఫిబ్రవరి 5 నుండి జరగబోయే మేడారం మహా జాతరను ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించి, పర్యావరణాన్ని కాపాడుకొనుటకు ప్రభుత్వం నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి మేడారం జాతర వన దేవతల జాతరని, వనం మధ్యలో జరుపుకొనే జాతరని, వనాన్ని, వనంలోని వన్యప్రాణులకు ప్లాస్టిక్ మహమ్మారి తో హానికలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరి పై ఉందన్నారు. దీనిలో భాగంగా, క్లాత్, జూట్, పేపర్ బ్యాగులు, తినుబండారాలకు సంబంధించి ఉపయోగించే పేపర్ ప్లేట్లు, కప్పులు తదితర తయారీదారులు, అమ్మకందారులతో ఈ నెల 17న మంగళవారం ఉ. 11.00 గంటలకు కలెక్టరేట్ లో సమావేశం ఏర్పాటు చేసినట్లు, ఆసక్తి కలవారు హాజరు కావాల్సినదిగా కలెక్టర్ తెలిపారు. తక్కువ ధరకు అందించడానికి ముందుకు వచ్చే దుకాణదారులకు జాతర ప్రాంగణంలో ఉచితంగా షాపులు కేటాయించుటకు జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నారు. ఆసక్తి కలవారు మంగళవారం కలెక్టరేట్ కు రావాల్సిందిగా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు