YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రంగు మారుద్ది..

రంగు మారుద్ది..

రంగు మారుద్ది..
మచిలీపట్నం, డిసెంబర్ 13 (న్యూస్ పల్స్): జిల్లా వ్యాప్తంగా ఉన్న రక్షిత మంచినీటి పథకాలు నూతన రూపు సంతరించుకోనున్నాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీలు నూతన రంగులతో శోభాయమానంగా తయారవ్వగా తాజాగా రక్షిత పథకాలకు రంగులు వేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెలాఖరు నాటికి ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టంచేయడంతో పంచాయతీ కార్యదర్శులు యుద్ధప్రాతిపదికన రంగులు వేయించే పనిలో నిమగ్నమయ్యారు. మంచినీటి సరఫరాలో లోటుపాట్లు చక్కదిద్దకుండా ట్యాంకుల సుందరీకరణపై దృష్టి పెట్టడం చర్చనీయాంశం అవుతోంది. పరిపాలనలో సంస్కరణల్లో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం అందుకు తగ్గ విధంగా కార్యాచరణకు తగు ఆదేశాలు జారీ చేస్తోంది. ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు చేరువ చేయాలన్న లక్ష్యంతో గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రతి రెండు వేల జనాభాకు అన్ని విభాగాల సేవలు ఒక్కచోటే అందించాలన్న నిర్ణయంతో జిల్లాలోని 980 గ్రామ పంచాయతీలను నిర్దేశిత నిబంధనల మేరకు సచివాలయాలుగా మార్చారు. గడచిన అక్టోబరు 2 గాంధీ జయంతి సందర్భంగా సచివాలయాలు ప్రారంభమయ్యాయి. నూతనంగా ఏర్పాటవుతున్న సచివాలయ వ్యవస్థకు సకల హంగులు కల్పించాలని చెప్పారు. అవి ప్రారంభించే నాటికి సచివాలయ భవనాలకు రంగులు వేయాలని ఆదేశించారు. అధికారుల ఆదేశాలకు అనుగుణంగా బులుగు, తెలుపు, పచ్చ రంగులతో గాంధీ జయంతి నాటికి సచివాలయాలు ముస్తాబయ్యాయి. తాజాగా అన్ని రక్షిత పథకాలకు రంగులు వేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. తక్షణం పనులు ప్రారంభించి ఈ నెలాఖరులోపు రంగుల వేసే కార్యక్రమాన్ని పూర్తిచేయాలంటూ జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు విడుదల చేశారు. పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసి 15 నెలలు కావొస్తున్న నేపథ్యంలో ఆర్థిక వెతలు వెన్నాడుతున్నాయి. నూతన పాలకవర్గాలు ఏర్పడకపోవడంతో కేంద్ర ఆర్థిక సంఘ నిధుల విడుదల కూడా నిలిపోవడంతో అత్యవసర పనుల నిర్వహణకు కూడా నిధుల కొరత తప్పడంలేదు. ప్రధాన అవసరాలైన పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, తదితరాల నిర్వహణ విషయంలో కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఓపక్క నిధుల లేమి ఉండగా కొన్ని ప్రభుత్వ పరమైన కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఆర్థికభారం పంచాయతీల నెత్తిన మోపడంతో కార్యదర్శుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. సచివాలయాలకు రంగులు వేసేందుకు పంచాయతీ నిధులనే ఖర్చు చేయాలని సూచించారు. వాటికి రంగులు వేసి దాదాపు రెండు నెలలు కావొస్తున్నా నేటికి పలు పంచాయతీల్లో పనిచేసిన వారికి బిల్లులు చెల్లించలేదు. వాస్తవంగా పంచాయతీ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలోనే ఖర్చుచేయాల్సి ఉన్నా అత్యధికశాతం బయట వ్యక్తులే పనిచేశారు. కాస్త నోరున్న వారు ప్రత్యేక అధికారులపై ఒత్తిడి తెచ్చి బిల్లులు దక్కించుకోగా, మిగిలిన వారు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇంటిపన్నులు, తదితరాల రూపంలో వచ్చిన అరకొర నిధులు రంగులు నిమిత్తం చెల్లించడంతో కొన్ని పంచాయతీల్లో ఒప్పంద కార్మికుల జీతాలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో రక్షిత పథకాలకు రంగులు వేయాలన్న ఆదేశాలు కార్యదర్శులకు మింగుడుపడటం లేదు. జిల్లా మొత్తం మీద సీపీడబ్ల్యూ పథకాలు కాకుండా రమారమి 2,292 మంచినీటి పథకాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి రంగులు వేసేందుకు సగటున రూ.లక్ష ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని పంచాయతీ నిధుల నుంచి ఖర్చు చేయమని ఆదేశించారు. సహజంగా రంగులు వేయాలంటే అందుకు ముందస్తుగా అంచనాలు రూపొందించడంతో పాటు ఆయా పంచాయతీల్లో బడ్జెట్‌ ప్రొవిజన్‌ ఉండాలి. ఇవేవీ లేకుండానే యుద్ధప్రాతిపదికన నెలాఖరులోపు పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ కావడంతో కార్యదర్శులకు ఏంచేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. అవసరాలకు అనుగుణంగా సురక్షిత నీటిని సరఫరా చేయలేని పరిస్థితుల్లో ట్యాంకులకు రంగులు వేయడం అంత అవసరమా అన్న ప్రశ్నలు గ్రామాల్లో వినిపిస్తున్నాయి.

Related Posts