నో జనరిక్ (పశ్చిమగోదావరి)
ఏలూరు, డిసెంబర్ 13: పేదలకు తక్కువ ధరకే ఔషధాలు అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రారంభించిన అన్న సంజీవని జనరిక్ మందుల దుకాణాలు ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి. ప్రజల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో వీటిని నిర్వహించిన కొన్ని మండల సమాఖ్యలు నష్టాలపాలయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో దుకాణాలను మూసివేశాయి. ఫలితంగా పేదలు అవసరమైన ఔషధాల కొనుగోలుకు ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి వస్తోంది. గత ప్రభుత్వం 2016లో జిల్లాలోని మండల మహిళా సమాఖ్యల ద్వారా 48 అన్న సంజీవని జనరిక్ మందుల దుకాణాలను ప్రారంభించింది. ఔషధాల కొనుగోళ్లకు జిల్లా సమాఖ్య వివిధ ప్రాంతాల్లోని 14 ఫార్మా ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుంది. 1400 రకాల మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో అందుబాటులో ఉంచింది. వీటిలో ప్రధానంగా మధుమేహం, రక్తపోటు, గ్యాస్ట్రిక్, థైరాయిడ్, నరాల బలహీనత, బలానికి, ఆకలికి మందులు, జ్వరం, దగ్గు, జలుబుకు సిరప్‌లున్నాయి. జనరిక్ దుకాణంలో ఫార్మాసిస్టు పెట్టిన ఇండెంట్ ప్రకారం సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ వారు మందులను సరఫరా చేస్తుంటారు. నెలరోజుల వ్యవధిలో మందులకు సంబంధించిన సొమ్మును ఫార్మాసిస్టులు చెల్లించాల్సి ఉంటుంది.* ఏజెన్సీ సరఫరా చేసిన మందుల ఎమ్మార్పీకి సెంట్రల్ డ్రగ్ స్టోర్ సిబ్బంది అయిదు శాతం కలిపి జనరిక్ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఫార్మాసిస్టులు దానికి మరో 30 శాతం కలిపి ప్రజలకు విక్రయిస్తున్నారు. మార్కెట్లో ఉన్న ధరలతో పోలిస్తే జనరిక్ మందులు 20 నుంచి 80 శాతం తక్కువ ఉంటాయి. జిల్లాలో 72 జనరిక్ దుకాణాలుండేవి. వాటిలో మండల సమాఖ్యల ఆధ్వర్యంలో 48, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో 24 నడిచేవి. మండల సమాఖ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 48 దుకాణాల్లో ప్రస్తుతం 12 మాత్రమే పని చేస్తున్నాయి. 18 దుకాణాలను స్వయం సహాయ సంఘాల మహిళలకు అప్పగించగా.. మరో 18 దుకాణాలను నష్టాల కారణంగా మూసివేశారు. ఉన్న 12 దుకాణాలను కూడా స్వయం సహాయక సంఘాలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. నష్టాల నేపథ్యంలో జిల్లాలో మండల సమాఖ్యల ద్వారా నిర్వహిస్తున్న దుకాణాలను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించాలని, లేకుంటే మూసి వేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు గత జూన్ నెలలోనే సూచించినట్టు తెలుస్తోంది. ఇక స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే దుకాణాల్లో రెండు మూతపడ్డాయి. మొత్తమ్మీద మండల సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ప్రస్తుతం 52 దుకాణాలను నిర్వహిస్తున్నారు. మండల సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించే మందుల దుకాణాలను మూసివేయాలని జూన్‌లోనే జిల్లాకు సర్క్యులర్ వచ్చినా ఫార్మా కంపెనీలకు జిల్లా సమాఖ్య చెల్లించాల్సిన బకాయిల సొమ్ము రూ.లక్షల్లో ఉండటంతో ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదావేశారు. మూడు నెలల కిందట ఈ బకాయిలు రూ.30 లక్షలు ఉండగా అప్పటినుంచి సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి దుకాణాలకు మందుల సరఫరా నిలిపివేశారు. స్టోర్‌ను కూడా మూసివేయాలని చెప్పడంతో దానిలో ఉన్న మందులను వ్యాపారం బాగా చేస్తున్న దుకాణాలకు సరఫరా చేసి 24 గంటల్లో బకాయిని వసూలుచేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు రోగులకు జనరిక్ దుకాణాల్లో మందులు తీసుకోవాలని సూచించాలి. కాని బయట ప్రైవేటు మందుల దుకాణాల్లో తీసుకోమని సూచిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జనరిక్ దుకాణాల్లో ఫార్మాసిస్టులు వ్యాపార అభివృద్ధికి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడం లేదు. ఎందుకంటే వారికి విక్రయాలు ఎలా ఉన్నా కనీస వేతనం అందుతోంది. జనరిక్ దుకాణాల్లో మందుల జీవితకాలం(ఎక్స్‌పైర్) ముగిస్తే కంపెనీలు వెనక్కి తీసుకోవు. దీంతో కొన్ని మండల సమాఖ్యలు నష్టపోయాయి. జనబాహుళ్యం ఉన్న ప్రదేశాల్లో దుకాణాలు పెడితే వ్యాపారం బాగా జరిగే అవకాశం ఉంటుంది. కానీ అధిక అద్దె చెల్లించలేక పీహెచ్‌సీలు, ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశారు. అవి దూరంగా ఉండటంతో కొనుగోళ్లు మందగించాయి. జనరిక్ దుకాణాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తున్నారు. బయట దుకాణాలు రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉండటంతో రోగులు అక్కడే కొనుగోళ్లు చేస్తున్నారు.