YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

రియల్ దెబ్బ (ఖమ్మం)

రియల్ దెబ్బ (ఖమ్మం)

రియల్ దెబ్బ (ఖమ్మం)
ఖమ్మం, డిసెంబర్ 13 : జిల్లాలో వ్యవసాయ భూమి క్రమంగా తగ్గిపోతోంది. రియల్ దెబ్బకు అరకు దున్నే పొలాల విస్తీర్ణం పడిపోతోంది. సాగునీరులేక సేద్యం చేయలేక అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు వేగంగా విస్తరిస్తున్న స్థిరాస్తి వ్యాపారం ప్రభావం చూపుతోంది. ఖమ్మం జిల్లా కేంద్రంతోపాటు పరిసర మండలాలు, ఇతర పట్టణాల శివార్లలో వందలాది స్థిరాస్తి వెంచర్లు వెలుస్తున్నాయి. దీంతో వేలాది ఎకరాల పంట భూములు హలం సాగక వెలవెలబోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాగు స్వల్పంగా పెరిగినా అది మన్యం ప్రాంతంలోనే ఎక్కువ. అధికారిక లెక్కల ప్రకారం 10,166 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయలేదు. మైదాన ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. నగర విస్తరణ, వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయడంతో పరిసర ప్రాంతాల్లో భూములకు డిమాండ్‌ ఏర్పడింది. ఆర్థిక వెసులుబాటు కారణంగా గత ఐదారేళ్లుగా ఇంటి స్థలాలు కొనేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. నగర శివారు ప్రాంతాలు, పరిసర మండలాల్లో పంట భూములు స్థిరాస్తి వెంచర్లుగా మారుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం గ్రామీణం, రఘునాథపాలెం, కొణిజర్ల, చింతకాని, కామేపల్లి, వైరా, మధిర, సత్తుపల్లి తదితర మండలాల్లో స్థిరాస్తి వ్యాపారం ఎక్కువగా ఉంది. దీంతో సాగు నీరున్నా వెంచర్లుగా మారుతున్నాయి. ప్రధాన రహదారుల వెంట ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో భూములు పంటలు పండించకుండా పడావు పడి ఉంటున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది వర్షాలు అధికంగా కురిసాయి. నీటి లభ్యత కారణంగా సాగునీటి వనరులు, చెరువులు, బోరుబావుల కింద పంటల సాగు విస్తీర్ణం పెరగాల్సి ఉంది. అయినా అధికారిక లెక్కల ప్రకారం గతేడాది కంటే ఈ ఏడాది 7,242 హెక్టార్లలో అంటే 17,895 ఎకరాల్లో పంటల సాగు తగ్గింది. దీనిలో ఎక్కువ భాగం స్థిరాస్తి భూములే ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని స్థిరాస్తి వ్యాపార సంస్థలు శ్రీగంధం వంటి మొక్కల పెంపకం చేపట్టి ఇంటి స్థలం కొనుగోలు చేసేవారికి దీర్ఘకాలంలో ఆదాయం చూపే ప్రయత్నం చేస్తున్నాయి. స్థిరాస్తి వ్యాపారం నిర్వహించేందుకు రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా(కన్వర్షన్‌) మార్చాల్సి ఉంది. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వ్యవసాయేతర భూమిగా మారిస్తే ఈ పథకం వర్తించదు. అనధికార వెంచర్లతో స్థిరాస్తి భూముల పట్టేదారులకు రైతుబంధు అంది ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. అయినా ఎవరూ పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలోని అత్యధిక మండలాలన్ని ఏజెన్సీ మండలాలు. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న సుజాతనగర్‌ మండలం మైదాన ప్రాంత మండలం. ఇక్కడి భూములకు రిజిస్ట్రేషన్‌ సౌలభ్యం ఉంది. ఎకరం పొలం ధర రూ.30 లక్షల వరకు ఉండేది. అదే రహదారి పక్కన స్థిరాస్తి వ్యాపారులకు విక్రయిస్తే దాని విలువ రూ.1 కోటి వరకు ధర పలుకుతోంది. దీంతో రైతులు సాగు చేసే దానిపై ఆసక్తి తగ్గించి కొందరు సొంతంగా, మరికొందరు వ్యాపారులకు స్థిరాస్తి కోసం విక్రయాలు చేస్తున్నారు. పురపాలకాల శివారు ప్రాంతాలు, ఇతర మన్యం ప్రాంతాల్లో అనధికారికంగా స్థిరాస్తి వ్యాపారం సాగుతోంది.

Related Posts