మాత ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||
పద్మాసనభంగిమలో కూర్చొని ఉండేదేవీ ! పరబ్రహ్మ స్వరూపిణీ ! పరమేశ్వరీ ! జగజ్జననీ ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారము.
వివరణ : లక్ష్మి పద్మం నుండి జనించింది. పద్మంలోనే నివసిన్స్తుంది. పద్మాన్నే ధరిస్తుంది. పద్మం పైనే కూర్చుంటుంది. నిల్చుంటుంది. ఇలా ఆమేసర్వమూ పద్మమే ! పద్మమంటే ఇందు లక్ష్మి ఉంటుంది. పద్యతే అత్ర లక్ష్మీః అని వ్యుత్పత్తి. అమ్మ నివసించడంవల్లనే పద్మాలకు అంతటి శోభ, మృదుత్వం, ప్రశస్తీ వచాయి. పద్మాసన - పద్మాన్నే ఆసనంగా కల్గి ఉండేది. అయ్య పరబ్రహ్మ కనుక ఆయన అర్ధాంగి యగు లక్ష్మి యు పరబ్రహ్మమే ! లక్ష్మి మహానాయకురాలు. సృష్ఠి స్థితి లయాలకు ఆమె కారణం. మాత అంటే గర్భం తనలో ఇమిడియుండునది అని వ్యుత్పత్తి. అమ్మ సకలలోకాలనూ తన గర్భం లో ధరించి సృష్ఠి చేస్తుంది. కనుక జగజ్జనని.
శ్వేతాంబరధరే! దేవి ! నానాలంకారభూషితే !
జగత్ స్థితే ! జగన్మాత ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||
తెల్లనివస్త్రములు ధరించిన దేవీ ! అనేకాలయిన అలంకారాలు దాల్చినతల్లీ ! లోకస్థితికి కారణమైన విష్ణుపత్నీ ! జగన్మాతా ! మహాలక్ష్మి ! నీకు నమస్కారము.
వివరణ : మహాలక్ష్మిని శ్వేతాంబరధారిణిగా వర్ణించుట ఇందలి విశేషం. సాధారణంగా సరస్వతిని శ్వేతాంబరధారిణి గా నుతిస్తారు. ఇచ్చట లక్ష్మిని విద్యాలక్ష్మి గా భావించినపుడు ఆమె సరస్వతీ స్వరూపిణి అని భక్తులు భావించి ఆ రూపంతో దర్శించాలి. అష్టవిధలక్ష్ములలో విద్యా లక్ష్మి నానాలంకారభూషితురాలు. ఆభరణాలన్నీ సువర్ణరత్నమయమైనవే ! అమ్మ జగత్తునందలి చరాచర వస్తువు లన్నింటా నిల్చి వాటిల్ని శక్తిమంతాలుగా చేస్తుంది. అది అమ్మవారి విభూతి అనగా ఐశ్వర్యం, లోక్స్థితి కి అమ్మవారే కారణం !
ఫలశ్రుతి
మహాలక్ష్మ్యష్టకస్తోత్రం యః పఠేత్ భక్తిమాన్నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః ||
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం |
మహాలక్ష్మీ ర్భవే నిత్యం ప్రసన్నా వరదా శుభా ||
ఇంద్రకృతం శ్రీ మహాక్ష్మ్యస్టకం సంపూర్ణం ||
ఇంద్రుడు గావించిన ఈ మహాలక్ష్మీ స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో పఠించేవాళ్ళు రాజ్యాధికారం మొదలు సకలాభ్యుదయాలూ పొందుదురు. రోజుకు ఒకమారు ఉదయం మాత్రమే పఠించేవారు మహాపాపాలనుండి విముక్తులవుతారు. రోజూ ఉదయం, సాయంకాలం రెండు సార్లూ పఠించేవాళ్ళు ధనధాన్య సమృద్ధి కలవారవుతారు. మూడుకాలాల్లో ఉదయం, మధ్యాన్నం, సాయంకాలం - పఠించేవాళ్ళు సకల శత్రుబాధల్నీ తొలగించుకొని సుఖిస్తారు. అట్టివారికి మహాలక్ష్మి ప్రసన్నురాలై కోరిన వరాలు ఇస్తుంది. శుభాలు కల్గిస్తుంది.వివరణ : ఏ స్తోత్రాన్ని పఠించి ఫలం పొందాలన్నా, భక్తి ముఖ్యం. భక్తి లేని పారాయణం, చిల్లులు పడిన కుండలోపోసిన నీళ్ళవలె వృధా అవుతుంది. సర్వం మహాలక్ష్మీ ఆధీనం. ఆ తల్లి అనుగ్రహిస్తే సకల జీవులు ఇహ పర సుఖ జీవనులై ఉంటారు. కామక్రోధాధులైన అరిషడ్వర్గమే మహా శత్రువులు. వాళ్ళు నశిస్తేనే మానవులు శుద్ధాంతఃకరణులవుతారు. భగవదనుగ్రహపాత్రులవుతారు. అట్టివారిని మహాలక్ష్మి తన బిడ్డలుగా ఆదరించి రక్షిస్తుంది. అంతఃశత్రువుల్ని కూల్చాలంటే మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో స్తుతించి, పూజించాలి. త్రిలోకాధిపతియగు ఇంద్రుడు గావించిన ఈ దివ్య శ్తోత్రాన్ని మహర్షులు మనకు అనుగ్రహించారు.