* కుబేరుడికి ఆ పేరు రావడానికి పార్వతీదేవి కారణమా..?
కుబేరుడు అనగానే ఎవరికైనా సరే ధనాధిపతి అని వెంటనే గుర్తుకొస్తుంది. కుబేరుడు కేవలం ధనానికి మాత్రమే అధిపతి కాదు. ఆయన అధీనంలో కొన్ని దేవతా గణాలు కూడా ఉంటాయి. ఇలా కుబేరుడుని శివుడు అనుగ్రహించిన సందర్భం శివపురాణం రుద్రసంహిత సృష్టిఖండంలో కనిపిస్తుంది. కుబేరుడు అనేది అసలు పేరు కాదు. ఆయనను వైశ్రవణుడు అని పిలుస్తుండేవారు. దీనికి కారణమేమంటే విశ్రవసు వుకు ఈయన జన్మించటమే. అలా జన్మించటానికి కారణం కూడా ఉంది.పూర్వజన్మలో గుణనిధి అనే పేరున ఉండి అంత్యకాలంలో ఉపవాసం ఉండి శివాలయంలో దీపారాధన చేసి కన్నుమూయటమే. ఆ పుణ్యఫలంవల్ల వైశ్రవణుడిగా జన్మించటమేకాక శివుడికి అత్యంత సన్నిహితంగా ఉండే అవకాశాన్ని కూడా పొందాడు. వైశ్రవణుడికి పుణ్యప్రభావంవల్ల గత జన్మలో తాను చేసిన ఉపవాస, దీపారాధన ఫలితం బాగా గుర్తుంది. అందుకే మళ్లీ జన్మించాక మరింత శివభక్తిని, శివ అనుగ్రహాన్ని పొందటం కోసం కాశీ నగరానికి వచ్చి గంగాతీరంలో తీవ్రంగా తపస్సు చేశాడు.వైశ్రవణుడి తపస్సుకు మెచ్చిన శివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమయ్యాడు. అయితే పరమేశ్వరుడిని వైశ్రవణుడు చూడలేకపోయాడు. దానికి కారణం ఈశ్వరుడు అమితమైన కాంతితో ఉండటమే. అదే విషయాన్ని శివుడికి చెప్పి తనకు శివపాదాలను దర్శించుకొనేందుకు తగినంత కంటి చూపు ఇమ్మని అడిగాడు. శివుడు అలాగే కంటి చూపు ఇచ్చాడు. అయితే, వైశ్రవణుడు పక్కనే అమ్మవారివైపు కుటిలంగా చూసాడు. దాంతో ఆ తల్లి కోపగించి వైశ్రవణుడు ఏ కంటితో అసూయగా తనను చూశాడో ఆ కన్ను పోతుందని శపించింది. వైశ్రవణుడు మళ్లీ శివుడిని ప్రార్ధించటంతో శివుడు పార్వతికి నచ్చచెప్పాడు. అప్పడా తల్లి ఆనాటి నుంచి తెల్లగా ఉన్న అతడి కన్ను కమిలిపోయినట్టు కనిపిస్తూ ఉంటుందని ఈ కారణం చేతనే కురూపిగా ఉన్న అతడిని కుబేరుడు అని అందరూ పిలుస్తారని చెప్పింది. అసూయ అనేది ఎలాంటి వారికైనా సరే ప్రమాదకారి అనే సందేశాన్ని ఇవ్వటానికే తానలా చేస్తున్నట్లు చెప్పింది. ఆ తర్వాత శంకరుడు కుబేరుడిని ఆశీర్వదిస్తూ ఆనాటినుంచి అతడిని నవనిధులకు అధినాధుడిగా చేశాడు. అంతేకాక గుహ్యకులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు లాంటి వారందరికీ కూడా కుబేరుడే అధిపతి అని, తన కైలాసానికి సమీపంగా ఉండే అలకానగరం అతడికి రాజధాని అవుతుందని, కనుక అలకానగరానికి రమ్మని అక్కడ కుబేరుడికి అధికారాన్ని అప్పగిస్తానని చెప్పి పార్వతితో సహా శివుడు అంతర్గానమయ్యాడు.