పెరుగుతున్న వాహానాలతో రోడ్లు కిటకిట
కర్నూలు, డిసెంబర్ 14,
ఉమ్మడి తెలుగురాష్ట్రానికి మొదటి రాజధాని. ప్రస్తుత నవ్యాంధ్రలోని రాయలసీమ ప్రాంతంలో ముఖ్య నగరం.అటు కర్నాటక, ఇటు తమిళనాడుకు మారాలంటే ఆ నగరమే ప్రధాన కూడలి. ఇన్ని ప్రాధాన్యతలు ఆ నగరంలో ఇప్పుడు ట్రాఫిక్ పెరిగిపోయింది. రోడ్లపై నడవలేని పరిస్థితి. కర్నూలు నగరం 52 వార్డులు 6లక్షల జనాభా వెరసి అభివృద్ధి చెందుతున్న పట్టణంగా వెలుగొందుతున్నది. జిల్లాకు చుట్టూ పక్కల 54 మండలాలు ఉన్నాయి. ప్రతిరోజు జిల్లా కేంద్రానికి ఎంతో మంది పనుల కోసం వస్తూ వెళ్తుంటారు. రోజూ 30వేలకి పైగా జనాలు నగరానికి రాక పోకలు కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో కర్నూలు నగరంలో ఉన్న రోడ్లు నిత్యం వాహనాలతో కిటకిట లాడుతున్నాయి.ఉదయం లేచినప్పటి నుంచి ట్రాఫిక్ సమస్యతో నగర వాసులు కుస్తీ పడుతుంటారు. త్వరగా ఆఫీస్ గాని, కాలేజీకి గాని, స్కూల్ కు వెళదామంటే ప్రధాన కూడళ్లలో ఉన్న ట్రాఫిక్ లో ఇరుకుపోతుంటారు. దీంతో విసిగిపోతున్నారు. ఆటోలు ఓ వైపు... మరోవైపు ద్విచక్ర వాహనాల రాకపోకలతో రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ తో జామ్ జామ్ చేస్తున్నాయి. నగరంలో దాదాపు 25వేలకు పైగా ఆటోలు ఉన్నాయి. దీనికి తోడు నగరానికి వచ్చిపోయో వాహనాల సంఖ్య కూడా ఎక్కువే. దీంతో ప్రధాన కూడళ్లలైన రాజ్ విహార్ , సి క్యాంప్ సర్కిల్, కొత్త బస్ స్టాండ్, బళ్లారి చౌరస్తాలో భారీగానే ట్రాఫిక్ సమస్య ఉంది. మరో వైపు ట్రాఫిక్ సమస్య తీవ్రతరం కావడంతో జిల్లా పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ పై ఆటోలు, ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. అలాగే ప్రధాన షాపింగ్ మాల్స్ దగ్గర కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలతో పాటు ఈ చలనా రూపంలో జరిమానా విధిస్తున్నట్లు ట్రాఫిక్ డీఎస్పీ గంగయ్య తెలిపారు. ఈ-చలనాల ద్వారా నగరంలో చాలా వరకు ట్రాఫిక్ సమస్య క్లియర్ అయ్యిందంటున్నారు.మొత్తానికి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సమస్యను కంట్రోల్ చేసేందుకు కసరత్తు చేపట్టారు. ఇప్పటి వరకు ప్రధాన కూడళ్లు దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతున్నారు. రానున్న రోజుల్లో ట్రాఫిక్ సమస్యను పూర్తి స్థాయిలో రూపుమాపేందుకు ప్రజల నుంచి కూడా సహకారం అందితే బాగుంటుందని పోలీసులు అభిప్రాయ పడుతున్నారు.