YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మున్సిపాల్టీలకు మౌలిక సదుపాయాలు శ్రీకాకుళం

మున్సిపాల్టీలకు మౌలిక సదుపాయాలు శ్రీకాకుళం

మున్సిపాల్టీలకు మౌలిక సదుపాయాలు
శ్రీకాకుళం , డిసెంబర్  14,
నిధులు ఉపయోగించడం లేదు. మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం. వెరసి వెనక్కి మళ్లిపోయిన ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు. దీంతో అధికారుల తీరు విస్మయం గొలుపుతుంది. ఇదీ శ్రీకాకుళం జిల్లాలోని మున్సిపాలిటీల్లో పరిస్థితి. ఇవన్నీ వెనుకబడిన ప్రాంతాలు. కనీస మౌలిక వసతులకు నోచుకోని వీధులు. ఇలాంటి ప్రాంతాల్లో సకల మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి పట్టణానికి కోట్లు కుమ్మరించింది. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని నిర్ధేశించింది. మరింకేం మా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సంబరపడిన స్థానికులకు అధికారులు షాకిచ్చారు. సకాలంలో పనులు చేపట్టకపోవడంతో భారీ ఎత్తున నిధులు మురిగిపోయాయి. శ్రీకాకుళం నగరం, పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస మున్సిపాల్టీలతో పాటు రాజాం, పాలకొండ నగర పంచాయతీల్లో ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు సకాలంలో ఖర్చు చేయలేకపోయారు. రహదారులు, కాలువలు, సామాజిక భవనాలు, పార్కులు, స్లూయీస్ కాలువలు, విద్యుద్దీకరణ, సామాజిక భవనాల మరమ్మతులు, పెయింట్లు, ప్రహరీలు, ఇలా ఒకటేమిటి.. సకల మౌలిక వసతులు ఈ నిధులతో సమకూర్చే వీలుంది. అయినా వీటిని చేపట్టలేక అధికారులు చేతులెత్తేశారు. నిలువునా స్థానికులను ముంచేశారు. మళ్లీ నిధులు మంజూరైతే తప్ప మౌలిక వసతుల సమస్య తీరే పరిస్థితి లేదు.పట్టణాలకు ప్రభుత్వం ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు విడుదల చేస్తున్నా వాటిని ఖర్చు చేస్తున్నారా లేదా అన్న దానిపై ఉన్నత స్థాయిలో సమీక్ష చేయడం లేదు. నిర్ణీత గడువులోగా నిధులు ఖర్చు చేయకపోయినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం లేదు. వచ్చిన నిధులకు అంచనాలు రూపొందించేందుకు సరిపడా ఇంజినీరింగ్ అధికారులు లేరు. పర్యవేక్షించాల్సిన కమిషనర్లు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. రాజాం నగర పంచాయతీకి  సంవత్సరానికి రూ.20 కోట్ల వరకు కేటాయించారు. ఈ నిధులతో మౌలిక వసతులన్నీ సమకూరుతాయని  ప్రజలు ఆశించారు. అయినా ఒక్కటంటే ఒక్క పనీ చేపట్టలేదు. వచ్చిన నిధులు వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోయాయి. పోనీ సమస్యల్లేవా అంటే అదీ కాదు. అడుగడుగునా సమస్యలు వెంటాడుతున్నాయి. రాజాం నగర పంచాయతీ పరిధిలోని డోలపేట, పొనుగుటివలస దళితవాడలో కనీస వసతుల్లేవు. పక్కా ఇళ్లు దేవుడెరుగు.. రహదారులు పూర్తిగా శిథిలమైనాయి. కాలువలు పూర్తి స్థాయిలో లేవు. మౌలిక వసతులు సమకూర్చాలని కోరినా ఫలితం లేకపోయింది.గతేడాది మార్చిలోగా ఖర్చు చేయాలని రూ.20 కోట్ల వరకు మంజూరయ్యాయి. సకాలంలో ప్రతిపాదనలు రూపొందించి ఆమోదంతో పనులు చేపట్టలేకపోవడంతో నిధులన్నీ వెనక్కి వెళ్లిపోయాయి.

Related Posts