దూర విద్యా కేంద్రం పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్
హైద్రాబాద్, డిసెంబర్ 14
హైదరాబాద్‌లో నాగార్జున యూనివర్శిటీ దూర విద్యా కేంద్రం పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరిగింది. యూనివర్శిటీ నిబంధనల్ని తుంగలో తొక్కి రాత్రిళ్లు పరీక్షలు నిర్వహించడమే కాకుండా.. విద్యార్థులతో కాపీయింగ్ చేయిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.గీతాంజలి జూనియర్ కాలేజీ యాజమాన్యం గుంటూరు నాగార్జున యూనివర్శిటీ దూర విద్యా కేంద్రం స్టడీ సెంటర్‌కు అనుమతులు తెచ్చుకొంది. డిగ్రీ, పీజీ కోర్సుల్లో దాదాపు 200మందికిపైగా విద్యార్థులు అడ్మిషన్లు పొందగా.. వారికి కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్టలోని సక్సెస్ క్రియేటివ్ స్కూల్‌లో ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌లో శుక్రవారం విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.. దాదాపు 200మందికిపైగా హాజరయ్యారు.ఈ ఎగ్జామ్ సెంటర్‌లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోందని.. కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకున్నారు. వారిని చూసిన విద్యార్థులు గోడ దూకి పారిపోయారు. యూనివర్శిటీ నిబంధనలకు విరుద్దంగా రాత్రి సమయంలో పరీక్షలు నిర్వహించారు.. అంతేకాదు పుస్తకాలు ఇచ్చి మరీ మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు.. పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. కాలేజీ ప్రతినిధిని అదుపులోకి తీసుకున్నారు.షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించాల్సింది పోయి.. రాత్రిపూట గుట్టు చప్పుడు కాకుండా పరీక్షలు రాయిస్తున్నారు. అలాగే గీతాంజలి కాలేజీ యాజమాన్యం పాస్ గ్యారెంటీ అని చెబుతూ విద్యార్థుల్ని కోర్సుల్లో చేర్పిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల నుంచి వేలాది రూపాయలను వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో మరికొన్ని స్టడీ సెంటర్‌లలో కూడా ఇదే భాగోతం నడుస్తున్నట్లు సమాచారం. నిబంధనల్ని తుంగలో తొక్కి రాత్రిళ్లు పరీక్షలు నిర్వహించి.. మాస్ కాపీయింగ్ చేయించిన గీతాంజలి కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.