ప్రభుత్వాసుపత్రులలో రేబిస్ కొరత
అనంతపురం, డిసెంబర్ 16,
ఆస్పత్రుల్లో కుక్కకాటుకు సూది మందు అందుబాటులో లేకుండా పోయింది. జిల్లాలోని వివిధ పీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులు, సర్వజనాస్పత్రిలో యాంటీ రేబిస్ వ్యాక్సిన్(ఏఆర్‌వీ) కొరత ఏర్పడింది. దీంతో కుక్కకాటు బాధితులు అవస్థలు పడుతున్నారు. క్రమపద్ధతిలో వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉండగా.. ఉన్న ఫలంగా వ్యాక్సిన్ కొరత ఏర్పడడంతో కుక్కకాటు బాధితులు ప్రైవేట్‌గా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రైవేట్ మందుల దుకాణంలో ఒక్కో ఏఆర్‌వీ వాయిల్æ రూ.350 నుంచి రూ.400 అమ్ముడు పోతోంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకోలేక పేదలు సతమతమవుతున్నారు.కుక్కకాటు బాధితులు మొదటి రోజు 1 డోస్, మూడో రోజు రెండో డోస్, 7వ రోజు మూడో డోస్, 28వ రోజు నాల్గో డోస్ వేసుకోవాలి. జిల్లాలోని ఆస్పత్రులకు ప్రతి నెలా 8 వేల నుంచి 10 వేల వాయిల్స్ అవసరముంటుందని ఫార్మసీ సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రోజూ 80 మందికి ఏఆర్‌వీ వేస్తుంటారు. అలాంది రెండ్రోజులుగా వ్యాక్సిన్ వేయడం లేదు. దీంతో డోస్ మిస్ అవుతుందని కుక్కకాటు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఏఆర్‌వీ వ్యాక్సిన్ కొరత ఏర్పడింది.. ఈ వ్యాక్సిన్ సరఫరా చేసే భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్.. ఉత్పత్తిని తగ్గించినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నా.. వాస్తవానికి ప్రభుత్వ హయాంలో సదరు కంపెనీకి బకాయిలు చెల్లించకపోవడంతో పాటు సరఫరా సక్రమంగా లేదంటూ అపరాధరుసుం వేయడం కూడా కారణంగా తెలుస్తోంది.