పార్లమెంట్‌లో చేసిన పౌరసత్వ సవరణ చట్టంపై చాలా రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ చట్టాన్ని తేవడం వెనక మతపరమైన అంశాలు ఉన్నాయంటూ... ఢిల్లీలో జామియా వర్శిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాత్రంతా ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్ ముందు ఆందోళన చేశారు. చట్టాన్ని రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరపడంతో దాదాపు 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో జామియా వర్శిటీకి జనవరి 5 వరకు సెలవులు ప్రకటించారు. అలాగే ఢిల్లీలో 15 మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఆందోళనలు సరికాదన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్... శాంతియుతంగా నిరసన తెలపాలని కోరారు. దీనిపై లెఫ్టినెంట్ గవర్నర్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అటు ఉత్తరప్రదేశ్ అలీఘడ్ యూనివర్శిటీలోనూ ఆందోళనలు చెలరేగాయి. అక్కడ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. బెంగాల్‌లోని హౌరాలో కూడా ఇంటర్నెట్, కేబుల్ సేల్ని నిలిపివేశారు.హైదరాబాద్... గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్శిటీలో అర్థరాత్రి నుంచీ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీలో పోలీసుల కాల్పుల్ని వ్యతిరేకించిన విద్యార్థులు... కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.