ముందు వెనుక.. (వరంగల్)
వరంగల్, డిసెంబర్ 16: రెండూ కాకతీయులు కట్టిన ఆలయాలే. రెండింటిలోనూ అద్భుత శిల్ప సంపద ఉంది. ఒకటి అభివృద్ధి పథంలో కళకళలాడుతుంటే మరొకటి పట్టింపు లేక వెలవెలబోతోంది. ఇవి మరేంటో కావు. ముందుకెళ్తున్నది రామప్ప కాగా.. వెనుకంజలో నిలుస్తున్నది వేయిస్తంభాల గుడి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో ఉన్న రామప్ప యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కోసం పోటీ పడుతోంది. ఇప్పటికే అనేక దశలు దాటింది. జులై కల్లా స్వప్నం సాకారం అయ్యే వీలుంది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయం ఎన్నో ఏళ్లుగా తీవ్ర నిర్లక్యానికి గురవుతోంది. 2006లో కల్యాణమండపం పునర్నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటికి 13 ఏళ్లు గడిచినా పూర్తి కాలేదు. పనులు ముందుకు కదలడం లేదు. రామప్ప ఆలయాన్ని ఇప్పటికే మన దేశం నుంచి యునెస్కో గుర్తింపు కోసం పంపించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియలు చకచకా సాగిపోతున్నాయి. ఈ క్రమంలో జులై వరకు గుర్తింపు ప్రకటన వెలువడనుంది. అప్పటి వరకు ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు. కేంద్ర పురావస్తు శాఖ రూ. 15 నుంచి రూ. 20 కోట్ల వరకు వెచ్చిస్తోంది. శిథిలావస్థకు చేరిన ప్రహరీ గోడను నిర్మిస్తోంది. దీనికి సంబంధించి మరో 20 శాతం పనులు మిగిలిపోయాయి. ప్రస్తుతం గోడకు శిలలు అందుబాటులో లేవు. అప్పుడు నిర్మించిన శిలలను పోలిన వాటి కోసం పలు క్వారీలను పరిశీలించగా, జవహర్‌నగర్‌లో లభ్యమయ్యాయి. వాటిని తీసుకొచ్చి ప్రహరీని పూర్తి చేయనున్నారు. మొన్నటి వరకు వర్షాలు కురవడంతో పనులను ఆపారు. త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. ఆర్వో నీటి శుద్ధి కేంద్రం, ఆలయం చుట్టూ అందమైన ఉద్యానవనాలను తీర్చిదిద్దే కార్యక్రమం, పాదచారుల దారి, భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణం, పబ్లికేషన్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. గుర్తింపు దక్కేసరికి ఆలయాన్ని అంతర్జాతీయ పర్యాటక ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అధికారులు నడుంబిగించారు. రామప్పను గతంలో రోజుకు 500 మంది సందర్శించే వారు. ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపైంది. శని, ఆదివారాల్లో కనీసం పదివేల మంది సందర్శకులు సుదూరాల నుంచి వస్తుంటారు. యునెస్కో గుర్తింపు దక్కితే నిత్యం దేశ, విదేశీ పర్యాటకుల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే పని వేళలు ఉన్నాయి. రాత్రి 8 గంటల వరకు పెంచాలని కేంద్ర పురావస్తు శాఖను అనుమతి కోరారు. త్వరలో పొడిగించే వీలుంది. ఒక వైపు కేంద్ర పురావస్తు శాఖ ఆలయ పరిసరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే మరోవైపు జిల్లా యంత్రాంగం అనేక నిర్మాణాలను చేపట్టేందుకు సిద్ధ్దమవుతోంది. కలెక్టర్ నారాయణరెడ్డితోపాటు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఈ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఒక పర్యాటక గ్రామాన్ని అభివృద్ధి చేయడంతోపాటు అద్భుతమైన ఆడిటోరియం, శిలా స్వాగత తోరణం నిర్మించి ఈ ప్రాంతాన్ని పర్యాటక స్వర్గంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. వేయిస్తంభాల ఆలయంలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదు. రూ. 1.20 కోట్ల నిధులను హృదయ్ పథకం కింద వెచ్చించి ఆలయం బయట కూర్చోవడానికి రాతి కుర్చీలు ఏర్పాటుచేశారు. ముందు భాగంలో కొంత పచ్చదనం కనిపిస్తుంది. కల్యాణ మండపం పూర్తయ్యేదెన్నడో అర్థం కాని పరిస్థితి నెలకొంది. 2006లో ప్రాచీన కల్యాణ మండపాన్ని తొలగించి అదే స్థానంలో కొత్తదాని నిర్మాణం మొదలుపెట్టారు. ఇందుకోసం రూ. 7 కోట్ల నిధులను వెచ్చించారు. నిర్మాణంలో తీవ్ర జాప్యం జరగడంతో శిల్పులు తమకు గిట్టుబాటు కాదని సగంలోనే వదిలేసి వెళ్లారు. అప్పుడప్పుడు అధికారులు నామమాత్రంగా సమీక్ష జరపడం తప్ప కల్యాణ మండపాన్ని పూర్తిచేయాలన్ని ధ్యేయంతో పనిచేయడం లేదు. స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరూ దీని గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వేయిస్తంభాల ఆలయాన్నీ యునెస్కో ప్రతిపాదనకు పంపారు. చుట్టూ ఆక్రమణలు ఉండడం వల్ల ఇది అర్హత సాధించలేదు. కనీసం ప్రభుత్వాలైనా నిధులు వెచ్చించి ఈ అద్భుత ఆలయాన్ని బాగుచేస్తాయంటే అదీ లేదు. పార్కింగ్ వసతి సరిగా లేదు. మరుగుదొడ్లు, తాగునీరు లాంటి కనీస సౌకర్యాలు కరవయ్యాయి.