హెల్మెట్ పెట్టుకోకుండా మోటార్ సైకిల్ నడిపినందుకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎంపీ అలోక్ సంజార్ రూ.250 జరిమానా కట్టారు. సోమవారం ‘ఏక్తామ్ యాత్ర’లో పాల్గొన్న ఆయన హెల్మెట్ లేకుండా ప్రయాణించారు. ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఆది శంకరాచార్య విగ్రహం కోసం విరాళాలు సేకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్ర చేస్తున్నారు. భోపాల్ ఎమ్మెల్యే సురేంద్ర నాథ్ సింగ్‌తో కలిసి అలోక్ హెల్మెట్ లేకూండా బైక్‌పై వెళ్తుండగా ఎవరో ఫొటో తీసి ట్రాఫిక్ పోలీసు వాట్సాప్ నెంబర్‌కు పంపించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన జరిమానా కట్టడంతో పాటు క్షమాపణలు చెప్తూ ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయనని ట్వీట్ చేశారు.
పార్టీ కార్యకర్తలు అడగడంతో మోటార్‌సైకిల్‌పై హెల్మెట్ లేకుండా వెళ్లాల్సి వచ్చిందని, భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటానని అలోక్ ట్వీట్‌లో తెలిపారు. ట్రాఫిక్ పోలీసు అధికారి నుంచి తనకు ఫోన్ వచ్చిందని, హెల్మెట్ లేని ప్రయాణంపై ఫిర్యాదు వచ్చినట్లు చెప్పారని, వెంటనే ట్రాఫిక్ పోలీసు కార్యాలయానికి వెళ్లి జరిమానా కట్టానని చెప్పారు. హెల్మెట్ లేకుండా బండి, సీటు బెల్ట్ లేకుండా కారు నడపకూడదని తనకు తాను ప్రమాణం చేసుకున్నట్లు చెప్పారు. యాత్ర సమయంలో తాను, పార్టీ కార్యకర్తలు ప్రయాణిస్తున్న జీపు చెడిపోవడంతో మోటార్‌సైకిల్‌పై వెళ్లాల్సి వచ్చిందని, తొందరలో హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయానని వివరణ ఇచ్చారు.