YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

తేమ చుట్టూ కథ (కృష్ణాజిల్లా)

తేమ చుట్టూ కథ (కృష్ణాజిల్లా)

తేమ చుట్టూ కథ (కృష్ణాజిల్లా)
మచిలీపట్నం, డిసెంబర్ 16 : జిల్లాలో పత్తి ప్రధాన వాణిజ్య పంట. దిగుబడులు, విక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారత పత్తి సంస్థ కేంద్రాల్లో నిబంధనలు ప్రతిబంధకంగా ఉన్నా నాణ్యమైన దూదికి మాత్రం మద్దతు ధర లభిస్తోంది. దూదిని కేంద్రాలకు తెచ్చే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభిస్తుంది. ఇందుకు తేమశాతం తక్కువగా ఉండేలా చూసుకోవడం ప్రాధాన్యతగా భావించాలి. సీసీఐ కొనుగోలుదారులు తేమశాతం ప్రామాణికంగా దూదిని పాసింగ్‌ చేసి, ధరను ఖరారు చేస్తున్నారు. నిబంధనల మేరకు తేమశాతం ఉంటే క్వింటాల్‌కు అత్యధికంగా మద్దతు ధర రూ.5,550 లభిస్తుంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పంటల్లో వరి తర్వాత పత్తి ద్వారా ఆదాయం రావడం ఆరంభమైంది. శీతాకాలం చలిగాలులతో పాటు మంచు కురుస్తోంది. ఈ సమయంలోనే జాగ్రత్తతో దూదిని తీసి తేమ లేకుండా ఆరుదల ఉండేలా చూసుకోవాలి. చలి, మంచుకు మొక్కలపైనే దూది తడిసి తేమశాతం అధికంగా ఉంటుంది. పత్తి తీసిన వెంటేనే సీసీఐ కేంద్రాలకు తీసుకువస్తే తేమశాతం ఎక్కువగా ఉండి కొనుగోలుకు బయ్యర్లు చొరవ చూపడం లేదు. తేమ 12శాతం లోపు ఉంటేనే బయ్యర్లు పాసింగ్‌ చేస్తున్నారు. ఆపైన ఉంటే తిరస్కరిస్తున్నారు. ఇప్పటికి కొందరు రైతులు తెస్తున్న పత్తిలో తేమ 15 శాతం వరకు ఉంటుంది. ఆరుగాలం కష్టపడి పండించిన తెల్ల బంగారానికి ధర కలిసి వస్తేనే ఆదరువు. తేమశాతం కారణంగానే పత్తికి సరైన ధర రావడంలేదని ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ నుంచి కేంద్ర ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,550 ప్రకటించింది. కొందరు రైతులకు మాత్రమే గరిష్ఠ మద్దతు ధర లభిస్తోంది. ధర వ్యత్యాసంపై ప్రశ్నిస్తే తేమశాతమే కారణమని సీసీఐ బయ్యర్లు చెబుతున్నారు. ప్రయివేటు వ్యాపారులు తేమశాతంతో ప్రమేయం లేకుండా కొనుగోలు చేస్తున్నా అన్నదాతలు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ప్రయివేటు వ్యాపారులు క్వింటాల్‌కు రూ.4,000 నుంచి రూ.4500 వరకు కొనుగోలు చేస్తున్నారు. తేమశాతం, ఎగుమతి, దిగుమతి, ఈ-పంట సమస్యలు భరించలేక అన్నదాతలు గ్రామాల్లోనే వ్యాపారులకు అయినకాడికి విక్రయిస్తున్నారు. ఇక్కడే క్వింటాల్‌కు రూ.1000 వరకు నష్టపోతున్నారు. తొందరపడి తక్కువ ధరకు ప్రయివేటు వ్యాపారులకు అమ్ముకోవద్దని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నా...నిబంధనలు కారణంగా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయలేకపోతున్నారు. జిల్లాలోని తిరువూరు, నూజివీడు, మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల పరిధిలో పత్తిని 1.30 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. 13 లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి లభిసుందని అంచనా. ఇప్పటివరకు గంపలగూడెం, తిరువూరు, ఎ.కొండూరు, విసన్నపేట, మైలవరం, నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, రెడ్డిగూడెం, జి.కొండూరు, గన్నవరం, నూజివీడు, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలో 3 లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి లభించింది. ఇప్పటి వరకు ఉత్పిత్తి చేసిన పత్తిలో 60శాతం వరకు ప్రయివేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. నవంబరు మొదటి పక్షంలో క్వింటాల్‌కు రూ.2500 నుంచి రూ.3,000 ధరతో కొన్నారు. సీసీఐ కేంద్రాలు ప్రారంభించాక ధరలు అనూహ్యంగా పెరిగాయి.

Related Posts