ఎన్ఎండీసీతో ఏపీ సర్కార్ ఒప్పందం
అమరావతి డిసెంబర్ 16,
కడప స్టీల్ ప్లాంట్ కు ఇనుప ఖనిజం సరఫరాపై జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ)తో ఏపీ ప్రభుత్వం త్వరలో ఒప్పందం చేసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ కు అవసరమైన ముడి ఇనుము ఖనిజం కోసం ఈనెల 18న ఈ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు. ఈ నెల 23న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అంతకంటే ముందు ముడి ఇనుము సరఫరాకు సంబంధించి భరోసా ఉండేలా ఎన్ఎండీసీతో ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకోనుంది. ఛత్తీస్ ఘడ్ లోని గనుల నుంచి ముడి ఇనుము సరఫరా చేయాలని ఎన్ఎండీసీ భావిస్తోంది. రూ.పది వేల కోట్ల పెట్టుబడితో ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే 35 ఏళ్లకు 160 నుంచి 200 మిలియన్ టన్నుల ముడి ఇనుము ఖనిజం అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు.