రేషన్ కార్డులకు చెల్లుచీటి...?
అనంతపురం, డిసెంబర్ 17, (న్యూస్01 రేషన్ కార్డులకు చెల్లుచీటి...?
అనంతపురం, డిసెంబర్ 17,
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్ట పరిచే చర్యల పేరుతో కార్డుల కోతకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగుల కార్డులను తొలగించారు. పౌరసరఫరాల శాఖ, ఉపాధి కల్పన శాఖలు కార్డుల అనర్హుల జాబితాను తయారు చేసే పనిలో నిమగం అయ్యారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వచ్చే కొత్త ఏడాది నుంచి రేషన్ పంపిణీ పారదర్శకంగా అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో వేల సంఖ్యలో రేషన్ కార్డులు తొలగించే అవకాశం కన్పిస్తోంది.జిల్లా వ్యాప్తంగా 3012 చౌకదుకాణాల పరిధిలో 12.30 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేసే క్రమంలో అనేక నిబంధనలను కొలబద్ధగా చేసింది. ఈ క్రమంలో జిల్లాలోనూ వేలాది కార్డులకు వచ్చే జనవరి నుంచి రేషన్ కోత పడనుంది. ముఖ్యంగా ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్, ఇతర విభాగాల కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటికే పిఎస్‌ఎంఎస్ నుంచి వేతనాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులను పౌరసరఫరాల శాఖ సేకరించి పరిశీలిస్తోంది. అవుట్‌సోర్సింగ్, ఇతర కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను ఉపాధి కల్పన అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటికే పిఎస్‌ఎంఎస్ ద్వారా వేతనాలు తీసుకుంటున్నారని సుమారుగా 10 వేల మందిని ప్రభుత్వం గుర్తించి వివరాలను సేకరించింది. ఉపాధి కల్పన శాఖ, గ్రామ సచివాలయ, వాలంటీర్ల ద్వారా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. రేషన్ కార్డుల ఏరివేతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అర్బన్‌లో రూ.12 వేలు, రూరల్‌లో రూ.10 వేలు నెల వేతనాలు తీసుకుంటున్న వారిని, సొంత కారు, మున్సిపాల్టీల్లో 750 చదరపు అడుగుల గృహం, 350 యూనిట్లు విద్యుత్ బిల్లు దాటిని వారిని, ఇన్‌కంటాక్స్ చెల్లిస్తున్న వారు, పది ఎకరాల భూమి కలిగిన వారికి రేషన్‌కార్డులు తొలగించేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వీటి పరిధిలో కార్డులను తొలగించి, వచ్చే జనవరి నుంచి క్షేత్రస్థాయిలో ప్రజా పంపిణీని కట్టుదిట్టంగా అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రజాపంపిణీ వ్యవస్థ బలోపేతం పేరుతో అర్హులకు ఇబ్బంది కలిగించకూడదని ప్రజా సంఘాలు అభిప్రాయ పడుతున్నాయి.