YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సిక్కోలు సుశీలకేనా

సిక్కోలు సుశీలకేనా

సిక్కోలు సుశీలకేనా
శ్రీకాకుళం, డిసెంబర్ 17,
చంద్రబాబునాయుడుపై ఒక విమర్శ ఉంది. ఆయన చెప్పిన మాటని నిలబెట్టుకోరని అంటారు. ఆయన జనాలకు ఇచ్చిన హామీల మాదిరిగానే నాయకులు, పార్టీ క్యాడర్ కి ఇచ్చిన హామీలు, చెప్పిన విషయాలు నెరవేర్చే విషయంలో పెద్దగా ఆసక్తి చూపరని కూడా తమ్ముళ్ళతో పాటుగా ప్రత్యర్ధులు నిందలు వేస్తారు. అయితే తాను మారాను అని పదే పదే చంద్రబాబు అంటున్నా విపక్షంలో ఉన్నప్పటి మాటలుగానే కార్యకర్తలు కూడా చూస్తారు. ఒకసారి అధికారంలోకి కనుక చంద్రబాబు వస్తే మాత్రం ఆయన్ని పట్టలేమని చుట్టూ కోటరీ చేరిపోతుందని కూడా చెబుతారు. ఇపుడు ముచ్చటగా మూడవసారి చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చారు. ఆయన జిల్లా టూర్లలో చెబుతున్న మాటలు ఏంటంటే నేను ఇప్పటివరకూ కొన్ని పొరపాట్లు చేశారు, ఇపుడు మాత్రం నిజమైన కార్యకర్తలకే పెద్ద పీట వేస్తాను అని. మరి ఆ మాట చంద్రబాబు నిజంగా నిలబెట్టుకుంటారా అని శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాయకులు ఎదురుచూస్తున్నారు.శ్రీకాకుళం జిల్లా అంటేనే టీడీపీకి పెద్ద నాయకులు ఉన్న ప్రాంతం. ఓ వైపు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు, మరో వైపు ఏపీ టీడీపీ శాసనసభా పక్ష ఉప నేత, మరో వైపు మాజీ మంత్రులు గౌతు శివాజీ, గుండా అప్పలసూర్యనారాయణ, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్, కింజరపు రామ్మోహననాయుడు, ఇలా చాలా మంది పెద్ద తలకాయలు జిల్లాలో ఉన్నారు. అయితే ఇపుడు పార్టీలో అతి సామాన్య కార్యకర్తగా ఉంటూ పాతికేళ్ళుగా విధేయతతో పనిచేస్తూ వస్తున్న ఒక మహిళ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ పదవిని ఆశిస్తున్నారు. ఆమె పేరు బగాది సుశీల. పాలకొండ నియోజకవర్గంలో ఉన్న ఆమె ఎపుడో దాశాబ్దన్నర కాలం క్రితం పాలకొండ మేజర్ పంచాయతి సర్పంచ్ గా టీడీపీ తరఫున పోటీ చేశారు. ఆమె ఇపుడు జిల్లా టీడీపీ కమిటీ మెంబర్ గా ఉన్నారు. తనకు కనుక అవకాశం ఇస్తే జిల్లాలో టీడీపీని బలోపేతం చేస్తానని సుశీల‌ చెబుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అవకాశం ఇస్తానని చంద్రబాబు చెబుతున్న నేపధ్యంలో ఆమె తనకు జిల్లా అధ్యక్ష పదవి ఇప్పించాలని కోరుతూ ఒక దరఖాస్తు చేసుకున్నారు.శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఇపుడు బలంగా ఉంది. పది ఎమ్మెల్యే సీట్లకు ఎనిమిదింటిని గెలుచుకుంది. స్పీకర్ తమ్మినేని సీతారాం ఓ వైపు ఉంటే ధర్మాన కుటుంబం మరో వైపు ఉంది. ఇక దిగ్గజ నేత, బలమైన సామాజిక వర్గానికి చెందిన పాలవలస రాజశేఖరం కుటుంబంతో పాటు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వంటి వారు వైసీపీలో ఉన్నారు. వీరిని ఢీ కొట్టి జిల్లాలో పార్టీని నిలబెట్టే సత్తా సుశీల‌కు ఉందా అని అధినాయకత్వం ఆలోచించవచ్చేమో. అయితే సుశీల మిగిలిన నాయకుల మాదిరిగా కాకుండా పార్టీ కోసం బాగా కష్టపడే నాయకురాలని అంటున్నారు. పైగా జిల్లాలో బలమైన కాళింగ సామాజికవర్గానికి చెందిన నేత. మరి చంద్రబాబు తాను ఒక సామాన్య కార్యకర్తను జిల్లా ప్రెసిడెంట్ చేశానని చెప్పుకునేందుకు, మాట తప్పనని చాటుకునేందుకు ఇదే మంచి అవకాశం అని కూడా అంటున్నారు. క్యాడర్ విశ్వాసం గెలుచుకోవాలంటే చంద్రబాబు వారికే పెద్ద పీట వేయాలన్న మాట వినిపిస్తోంది. మరి చంద్రబాబు ఈ సాహసం చేయగలరా? లేదా? అన్నది చూడాలి

Related Posts