బీఆర్ఎస్ లకు కనిపించని స్పందన
హైద్రాబాద్, డిసెంబర్ 17,
మహానగరంలో అక్రమ లే అవుట్లలోని ప్లాట్లకు చట్టబద్దతను కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్ స్కీం కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చినా, దరఖాస్తుదారుల నుంచి స్పందన రావటం లేదు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్‌ఎంసీకి ఎల్‌ఆర్‌ఎస్ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరిస్తే కొంత మేరకు నిధులు సమకూరుతాయని భావించినా, సర్కారు, అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. అందుకోసం అధికారులు సర్కిళ్ల వారీగా ప్రత్యేకంగా ఎల్‌ఆర్‌ఎస్ మేళాలను నిర్వహించినా, ఫలితం దక్కటం లేదు. ఎల్‌ఆర్‌ఎస్ స్కీం కింద నిర్ణీత గడువు 2016 డిసెంబర్ 31నాటికి జీహెచ్‌ఎంసీకి మొత్తం 85వేల 291 దరఖాస్తులు అందగా, ఇందులో అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నట్లు నిర్దారించి, క్షేత్ర స్థాయిలో తనిఖీల అనంతరం 28వేల 935 దరఖాస్తులకు క్లియరెన్స్ ప్రొసీడింగ్‌లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 20వేల 425 దరఖాస్తులు పరిష్కరించి, క్లియరెన్స్ ఇచ్చేందుకు వీల్లేకుండా ఉండటంతో అధికారులు తిరస్కరణకు కారణాలు తెలపుతూ వీటిని తిరస్కరించారు.వీటిలో 25వేల 726 దరఖాస్తులకు సంబంధించిన కొన్ని నో ఆబ్జక్షన్ సర్ట్ఫికెట్లు వంటి ఇతరాత్ర డాక్యుమెంట్ల సమర్పిస్తే పరిష్కరించనున్నట్లు యజమానులు నియమించుకున్న ఆర్కిటెక్చర్లకు షార్ట్ఫాల్ లెటర్లను పంపారు. వీటిలో అత్యధిక శాతం మంది దరఖాస్తుదారులు స్పందించలేదు. కేవలం 2516 మంది యజమానుల మాత్రమే అంటే కేవలం పది శాతం మంది స్పందించి అధికారులు సూచించిన డాక్యుమెంట్లను సమర్పించారు. పెండింగ్‌లో ఉన్న ఈ దరఖాస్తులన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఇంకా పక్షం రోజులు మాత్రమే ఉంది. ఈ నెలాఖరులోపు దరఖాస్తుదారులు స్పందించని పక్షంలో ఇప్పటికే వారు చెల్లించిన ఓ దఫా ఛార్జీలతో పాటు ఈ దరఖాస్తులు అపరిష్కృతంగానే మిగిలిపోనున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్ స్కీం ప్రారంభం కాగానే, అక్రమ లే అవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం హడావుడిగా దరఖాస్తులు సమర్పించిన దరఖాస్తుదారులు ఇపుడెందుకు స్పందించటం లేదన్నది చర్చనీయాంశంగా మారింది.ముఖ్యంగా అధికారులు షార్ట్ఫాల్ లెటర్లు పంపిన కొన్ని దరఖాస్తులకు సంబంధించి అర్బన్ ల్యాండీ సీలింగ్, ఎన్విరాన్‌మెంట్, ఫారెస్టు డిపార్ట్‌మెంట్‌ల క్లియరెన్స్‌లు, రెవెన్యూ నుంచి నో ఆబ్జక్షన్ సర్ట్ఫికెట్లు వంటి ఇతర డాక్యుమెంట్లు సమర్పించాలని అధికారులు సూచించినా, అవి ఎలా పొందాలో దరఖాస్తుదారులకు అవగాహన కల్పించటంలో జీహెచ్‌ఎంసీ అధికారులు విఫలమైనందునే వీరు నిర్వహించే ఎల్‌ఆర్‌ఎస్ మేళాలకు స్పందన రావటం లేదన్న చర్చ లేకపోలేదు. అంతేగాక, వీరు మేళా నిర్వహించినా, అందులో అన్ని విభాగాల అధికారులుండేలా చూస్తామని ప్రకటించుకుంటున్నారే తప్ప, ఇతర విభాగాల అధికారులను మేళాలకు తీసుకురావటంలో బల్దియా అధికారులు వహిస్తున్న నిర్లక్ష్యం కూడా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల క్లియరెన్స్‌కు గ్రహణంగా మారింది.