సిటీలో బస్సు కష్టాలు
హైద్రాబాద్, డిసెంబర్ 17,
ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు. బస్సులను తగ్గించడం, ఉన్నవి కూడా సమయానికి రాకపోవడం, వచ్చినా కిక్కిరిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నష్టాల పేరుతో ఆర్టీసీలో ఈ మధ్యే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,000 బస్సులను పక్కన పెట్టేశారు. ‘కాలం చెల్లిన బస్సుల’ పేరుతో జిల్లాల్లోనూ కొన్ని చోట్ల నిలిపేశారు. ఈ ఎఫెక్ట్ ప్రయాణికులపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా స్టూడెంట్లు, ఉద్యోగుల బాధలు వర్ణనాతీతం. దీంతో చాలా చోట్ల తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.. గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఎక్కువగా నష్టాలు వస్తున్నాయని, అలాంటప్పుడు ఎక్కువ బస్సులు నడపాల్సిన అవసరంలేదని, 500 బస్సులను రద్దు చేయాలని సూచించారు. కానీ అధికారులు మాత్రం 1,000 బస్సుల దాకా పక్కనపెట్టేశారు. గ్రేటర్‌లో 29 డిపోలు ఉండగా, ఒక్క డిపో నుంచి 20 నుంచి 30 బస్సులను పక్కన పెట్టేశారు. గతంలో సిటీలో రోజూ 3,838 బస్సులు నడిచేవి. ఇప్పుడు 2,838 మాత్రమే మిగిలాయి. నగర శివార్లలో వందలాది ఇంజనీరింగ్, ఒకేషనల్, ఐటీఐ తదితర కాలేజీలు ఉన్నాయి. వేలాది మంది స్టూడెంట్లు వీటిలో చదువుకుంటున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న బస్సులు సుమారు 1,500 వరకు ఉన్నాయి. సాధారణ ప్రయాణికులతోపాటు స్టూడెంట్లు కూడా ఈ బస్సుల్లో వెళ్తారు. దీంతో కిక్కిరిసిన బస్సుల్లో నిలబడటానికి కూడా చోటులేక ఫుట్బోర్డులపై రాకపోకలు సాగిస్తున్నారు.ఒక్కసారిగా వెయ్యి బస్సులను పక్కనపెట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూర్చునే సంగతి దేవుడెరుగు కనీసం నిల్చోడానికి కూడా చోటు దొరకడం లేదు. ఇంతకుముందు 5, 10 నిమిషాలకో బస్సులు వస్తే, ఇప్పుడు ఏకంగా అర్ధగంటకోసారి కూడా బస్సు రావడంలేదని ప్రయాణికులు వాపోతున్నారు. దీంతో బస్టాండ్లలోనే గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. బస్టాండ్లకు వచ్చినా ఆగకుండా పోతున్నాయి. దీంతో సమయానికి ఉద్యోగులు, స్టూడెంట్లు వెళ్లలేకపోతున్నారు. విద్యార్థినులు, మహిళలు బస్సులో ప్రయాణించాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల స్టూడెంట్ బస్‌పాస్‌లు ఉండగా, గ్రేటర్‌లోనే 4 లక్షల దాకా ఉన్నాయి.ప్రయాణికులు ఎలాగైనా గమ్యం చేరడానికి ఎన్నో ఫీట్లు చేస్తున్నారు. కనీసం నిల్చోడానికి చోటు లేకపోవడంతో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నారు. మగ, ఆడ, చిన్నాపెద్దా తేడా ఏం లేదు. అందరిదీ అదే పరిస్థితి. స్టూడెంట్లు ఏకంగా బస్సుల బ్యాక్‌సైడ్ ఉన్న అంచుపై ప్రమాదంగా నిల్చుని వెళ్తున్నారు. డ్రైవర్లు స్టాప్‌లలో బస్సులు ఆపకపోవడంతో స్టూడెంట్లు రన్నింగ్‌లో ఎక్కుతున్నారు. దీనివల్ల ఏ క్షణంలో అయినా ప్రమాదం జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రేటర్‌లో వెయ్యి బస్సులు పక్కన పెట్టగా, జిల్లాల్లోనూ కొన్ని బస్సులు రద్దు చేసినట్లు తెలిసింది. కాలం చెల్లిన బస్సుల పేరుతో కొన్నింటిని పక్కన పెడుతున్నారు. ఎక్కువ ట్రిప్పులు ఉన్న చోట, నష్టాలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనూ నడిపించడంలేదు. ఆర్టీసీ సమ్మె తర్వాత ఆక్యుపెన్సీ రేషియో తగ్గిందని, ప్రస్తుత పరిస్థితుల్లో మరింత తగ్గే చాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. బస్సుల తగ్గింపు విషయాన్ని అధికారులను అడిగితే ‘సీఎం చెప్పినట్లు చేయాలి కదా’ అని సమాధానమిస్తున్నారు.టైమ్కి బస్సులు రాకపోవడంతో ప్రైవేట్ వాహనదారుల పంట పండుతోంది. గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడటం, ప్రమాదకర ప్రయాణం చేయడం కంటే ప్రైవేట్ వాహనాల్లో వెళ్లడం నయమని ప్రజలు భావిస్తున్నారు.