ప్రపంచమంతా చంపేసే దోమల్ని సింగపూర్‌లో మాత్రం పనిగట్టుకొని పెంచుతారు.
దోమల్ని అందరూ చంపేయాలని చూస్తారు. అందుకోసం చక్రాలు, అగరబత్తిలు, లిక్విడ్‌లు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంతలా ప్రపంచమంతా చంపేసే దోమల్ని సింగపూర్‌లో మాత్రం పనిగట్టుకొని పెంచుతారు. లక్షల దోమల్ని పెంచి... గాల్లో వదులుతారు. ఎందుకు అన్న ప్రశ్న అందరికీ వస్తుంది. నిజానికి దోమలు చాలా ప్రమాదకరమైనవి. ఆడ దోమలు డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి. ఒక్కోసారి డెంగ్యూ వల్ల మరణం కూడా సంభవిస్తుంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి డెంగ్యూ సోకుతోంది. ఏటా 20 వేల మంది దాకా డెంగ్యూ వల్ల చనిపోతున్నారు. మరి డెంగ్యూ వ్యాధిని తరిమికొట్టాలంటే... డెంగ్యూని వ్యాపింపజేసే దోమలన్నింటినీ చంపేయాలి. అదంత ఈజీ కాదు కదా. అందుకే సింగపూర్‌లో ఓ సైంటిస్టుల టీం... దోమలు గుడ్లు పెట్టకుండా చేస్తే ఎలా ఉంటుంది అని పరిశోధన చేశారు. ఇందుకోసం వాళ్లు ప్రత్యేక దోమలను సృష్టించి, పెంచి, వాటిని లక్షలాదిగా గాల్లోకి రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం మస్కిటో నర్సింగ్ రూంలో లక్షల దోమల్ని పెంచుతున్నారు. ఈ కొత్త దోమలు మనల్ని కుట్టవు. మనకు హాని చెయ్యవు. ఈ కొత్త దోమలు... డెంగీ దోమల్ని శారీరకంగా కలుస్తాయి. తద్వారా డెంగీని వ్యాపింపజేసే దోమలకు గుడ్లు పెట్టే యోగం లేకుండా పోతుంది. ఇదీ సింగపూర్ అదిరిపోయే ఐడియా. ఇప్పుడు సింగపూర్‌లో రోడ్లు, పార్కులు, అడవులు ఇలా అన్ని చోట్లా మంచి దోమల్ని లక్షలాదిగా వదిలేస్తున్నారు. ఫలితంగా ఇప్పటికే సింగపూర్‌లో 90 శాతం డెంగ్యూ దోమలు చచ్చిపోయాయి. ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే... పక్క దేశాల నుంచీ డెంగ్యూ దోమలు వస్తూనే ఉంటాయి కదా.