సోషల్ మీడియాలో పుకార్ల వ్యాప్తిపై రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ హెచ్చరిక
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో పుకార్ల వ్యాప్తిపై రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ హెచ్చరిక జారీ చేసింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చెందకుండా రాష్ట్రప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశించింది. పౌరసత్వ సవరణ చట్టంపై సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేయడంతో హింసాకాండ చెలరేగుతుందని, రాష్ట్రాల్లో శాంతిభద్రతలను పరిరక్షించాలని రాష్ట్రప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ కోరింది.దేశంలో పలు ప్రాంతాల్లో వెల్లువెత్తుతున్న హింసాకాండలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నాయని హోంమంత్రిత్వశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పుకార్ల వ్యాప్తి వల్లనే ఢిల్లీలో బస్సు దహనం, పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మరణించిన ఘటనలు జరిగాయని హోంమంత్రిత్వశాఖ అధికారి పేర్కొన్నారు.