పొలమే పాఠశాల (శ్రీకాకుళం)
శ్రీకాకుళం, డిసెంబర్ 17 రైతులు సాగు మెలకువలు నేర్చుకోవడం ఎలా? అధిక దిగుబడులు సాధించేది ఎలా? సరికొత్త అంశాలు బోధపడేది ఎలా? వీటిని సాకారం చేసేందుకు ప్రభుత్వం రైతు క్షేత్ర పాఠశాలలను తెరపైకి తెచ్చింది. వీటికి ఈ ఏడాది రబీ నుంచే అంకురార్పణ చేసింది. రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. విత్తు నాటిన నుంచి పంట చేతికందే వరకు వీటిని కొనసాగించేవిధంగా ప్రణాళిక రచించారు. దీనిని కార్యక్షేత్రంలో పక్కాగా అమలు చేసేలా నడుం బిగించారు. ఉభయగోదావరి జిల్లాలకు దీటుగా జిల్లాలో పంటల విస్తీర్ణం సాగవుతున్నా దిగుబడుల్లో మాత్రం భారీ అంతరం నమోదవుతోంది. రైతుల్లో ఆధునిక సేద్యంపై అవగాహన లేమి ప్రతిబంధకంగా పరిణమిస్తోంది. వీటిని అధిగమించి రైతులను సాగులో నిష్ణాతులను చేసేవిధంగా ఈ ఏడాది రైతు క్షేత్ర పాఠశాలలను ఏర్పాటు చేస్తోంది. రైతులకు రాయితీపై వేపనూనె, వేపపిండి, సూడోమోనస్ మందును అందజేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 2019-20 రబీలో 445 పొలంబడులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వరి, వేరుశెనగ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పెసర, మినుము పంటలకు సంబంధించి ఇది కొన సాగుతుంది. పొలంబడి పరిణామం 25 ఎకరాలు (10 హెక్టార్లు)గా నిర్దేశించారు. ఒక్కో పొలంబడి పరిధిలో 30 మంది హలధారులు భాగస్వాములవుతారు. పొలంబడి నిర్వహణకు ప్రభుత్వం రూ.1.42 కోట్లు మేర వెచ్చించనుంది. ఆరోగ్యకర పంటలను పండించటం, రైతులను సాగులో నిష్ణాతులను చేయడం, మిత్ర పురుగులను సంరక్షించడం వంటి ప్రధాన లక్ష్యాలతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాయాల్లో కొత్తగా నియమించిన వ్యవసాయ సహాయకులు దీనికి నేతృత్వం వహిస్తారు. బహుళ ప్రయోజన, సహాయ విస్తరణాధికారులు, మండల వ్యవసాయాధికారులు పర్యవేక్షించేవిధంగా ఆదేశాలు ఇచ్చారు. సమగ్ర పంట యాజమాన్య పద్ధతులను నేర్చుకునేందుకు ఆసక్తి ఉన్న 20-50 ఏళ్ల వయసున్న రైతులనే ఎంపిక చేయాలి. ఇదే సమయంలో మహిళా రైతులకు తగిన ప్రాధాన్యం కల్పించాలి. వ్యవసాయశాఖ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబంధనలు అనుసరించి వీటిని ఏర్పాటు చేస్తే కర్షకలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వం ఎంపికలకు ప్రత్యేక మార్గదర్శకాలను నిర్దేశించింది. సంక్లిష్ట సమయంలో నీటివసతి లేని పొలాలను ఎంపిక చేయాలి. ఎక్కువ పురుగుమందులు, ఎరువుల వినియోగం, అత్యధిక చీడపీడల సమస్యలున్న గ్రామాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. మండలంలోని క్లస్టర్లను నాలుగు భాగాలుగా చేసుకొని ఒక్కో రోజు ఒక్కోక్లస్టరులో పొలంబడి నిర్వహించేందుకు వెసులుబాటు కల్పించారు. ప్రతి మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో వీటిని నిర్వహించవచ్చు లేదంటే ఒక్క రోజులోనే అన్నింటినీ నిర్వహించొచ్చు. మండల వ్యవసాయాధికారి వెసులుబాటును బట్టి దీన్ని నిర్ణయించుకోవచ్చు.