ఘనంగా ప్రారంభమైన ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు
తిరుపతి డిసెంబర్ 17, :
పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతి లోని అన్నమాచార్య కళామందిరంలో డిసెంబరు 17వ తేదీ తిరుప్పావై ప్రవచనాలు ప్రారంభమైనాయి. టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో డిసెంబర్ 17 నుండి 2020, జనవరి 14వ తేదీ వరకు నెల రోజులపాటు దేశవ్యాప్తంగా గల 243 కేంద్రాల్లో తిరుప్పావై ప్రవచనాలు, ప్రముఖ పండితులతో ధార్మికోపన్యాసాలు ఇవ్వనున్నారు. ధనుర్మాసం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం నుండి ప్రతి రోజు ఉదయం 7.00 నుంచి 8.00 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ చక్రవర్తి రంగనాథన్ తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. ధనుర్మాసం చివరిరోజైన 2020, జనవరి 14వ తేదీన ప్రవచనాల అనంతరం గోదాకల్యాణం నిర్వహిస్తారు.ధనుర్మాసం దేవతలకు బ్రహ్మముహూర్తం. ఈ బ్రహ్మముహూర్తాన్ని అనుసరించి 12 మంది ఆళ్వారులలో ఒకరైన గోదాదేవి ధనుర్మాసం వ్రతం పాటించారు. దేశ సుభిక్షాన్ని, లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ గోదాదేవి శ్రీక ష్ణునిలో ఐక్యమవ్వాలనేది ఈ వ్రతం ఉద్దేశం. ఈ వ్రతం పాటించడం వల్ల దేశం సమ ద్ధిగా, సుభిక్షంగా ఉంటుంది. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని క పకు పాత్రులయ్యారని భాగవతం దశమ స్కందంలో పేర్కొనబడింది. ఈ వ్రతం ఎలా పాటించాలనే విషయాన్ని గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధాన్ని లోకానికి అందించారు. ఈ తిరుప్పావై సారాంశం భగవంతునికి కైంకర్యం చేయడమే. ఈ వ్రతం ఒకరు చేయడం కాకుండా అందరినీ కలుపుకుని చేస్తే గొప్ప విశేషం. ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.