గోవాలో వాస్కో సిటీ నుంచి పనాజీ వెళ్లే రహదారిపై అమ్మోనియం గ్యాస్ తీసుకెళ్తున్న ట్యాంకర్ బోల్తాపడింది. చికాలిమ్ గ్రామం వద్ద తిరగబడిన ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకవుతుండడంతో ఆ గ్రామంలోని ప్రజలంతా ఖాళీ చేయాల్సి వచ్చింది. రాత్రి 2.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మార్ముగావ్ పోర్ట్ ట్రస్ట్ నుంచి జువారి ఇండస్ట్రీస్‌కు అమ్మెనియం గ్యాస్ తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. సహాయ బృందాలు, పోలీసులు, అగ్నిమాపక, అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.
అమ్మోనియా గ్యాస్ కారణంగా వూపిరాడకపోవడంతో ఇద్దరు మహిళలను ఆస్పత్రిలో చేర్పించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చాలా దగ్గరగా ఉన్న ఇంట్లో వారు నిద్రిస్తుండగా గ్యాస్ లీక్ కారణంగా వూపిరాడక ఇబ్బందిపడ్డారని తెలిపారు. వెంటనే ఊళ్లోని వందలాది మందిని ఖాళీ చేయించినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన రహదారిని మూసివేసి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. మాస్కులు ధరించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో దాదాపు 300 కుటుంబాలు ఉన్నాయి. కొద్ది కిలోమీటర్ల దూరంలోనే డోబోలిమ్ విమానాశ్రయం ఉంది.