దుమ్మురేపుతున్న క్వీన్ వెబ్ సిరీస్
చెన్నై, డిసెంబర్ 17,
తమిళనాడు రాజకీయాలను కంటి చూపుతోనే శాసించిన అతి కొద్ది మంది రాజకీయ నేతల్లో జయలలిత ఒకరు. సినీ నటిగా ప్రస్థానం ప్రారంభించిన ఆమె.. అన్నాడీఎంకే అధినేత్రిగా.. తమిళనాడు సీఎంగా ఎదిగిన తీరు నిజంగా అద్భుతం. 1991 నుంచి 2016 మధ్య ఆమె 14 ఏళ్లపాటు తమిళనాడు సీఎంగా పనిచేశారు. 1948 ఫిబ్రవరి 24న కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవవుర తాలూకాలోని మెల్కోటేలో.. తమిళ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు.జయలలిత తల్లి వేదవల్లి, తండ్రి జయరాం. జయరాం లాయరుగా పని చేసేవారు. అయ్యంగార్ల సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన రెండు పేర్లు కోమలవల్లి, జయలలిత. ఆమె తాత నరసింహన్ రంగాచార్యులు.. మైసూరు మహారాజా సంస్థానంలో ఆస్థాన వైద్యునిగా ఉండేవారు. జయలలిత జన్మించిన రెండేళ్లకే ఆమె తండ్రి చనిపోయారు. దీంతో ఆమె కుటుంబం బెంగుళూరులోని అమ్మమ్మ గారింటికి చేరింది. తల్లి వేదవల్లి బెంగుళూరులో చిన్న ఉద్యోగంలో చేరింది.జయలలిత చాలా చురుకైన విద్యార్థి. చదువులోనే కాకుండా ఆటపాటల్లోనూ ఆమె ముందుండేవారు. ప్రాథమిక విద్యను బెంగుళూరు బిషప్ కాటల్ బాలికల పాఠశాలలో పూర్తి చేసింది. మద్రాసు చర్చ్ పార్క్ కాన్వెంట్‌లోను కొనసాగించిన జయలలిత మెట్రిక్యులేషన్‌లో స్టేట్ టాపర్‌గా నిలిచింది. తండ్రిలాగే న్యాయ విద్య అభ్యసించాలని భావించినా కుదరలేదు. అనంతరం మద్రాస్‌లో రంగస్థల నటిగా స్థిరపడ్డ సోదరి అంబుజవల్లి వద్ద ఉంటూ.. సినీ అవకాశాల కోసం ప్రయత్నించింది. సంధ్య అనే పేరుతో తన ప్రస్థానాన్ని నాటకాలతో ప్రారంభించి.. సినీ నటి స్థాయికి ఎదిగింది.చదువుకుంటూనే సంప్రదాయ భరతనాట్యంతోపాటు మోహినీయాట్టం, మణిపురి, కథక్ వంటి నృత్యరీతులను జయలలిత నేర్చుకున్నారు. సంప్రదాయ కర్నాటక సంగీతం కూడా అభ్యసించారు.జయలలిత తమిళంతోపాటు తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 140 సినిమాల్లో జయలలిత నటించారు. ఆమె నటించిన ఏకైక హిందీ సినిమా ఇజ్జత్.జయలలిత 1981లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 43 ఏళ్లకే ఆమె ముఖ్యమంత్రి అయ్యారు ఆమె తమిళనాడు సీఎం అయ్యారు. దీంతో అత్యంత పిన్న వయసులోనే తమిళనాడు సీఎంగా ఎన్నికైన వ్యక్తిగా ఆమె రికార్డు నెలకొల్పారు.74 రోజులపాటు అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొంది ప్రాణాలు వదలిన జయలలిత జీవితం ఆధారంగా బోలెడన్న సినిమాలు వస్తున్నాయి. ఎంఎక్స్ ప్లేయర్‌లో క్వీన్ పేరిట వెబ్ సిరీస్ ప్రసారం అవుతోంది. ఇందులో జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు.