ఇక పరుగులే.. (తూర్పుగోదావరి)
కాకినాడ, డిసెంబర్ 18 : పరిశ్రమల్లో స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.ఈ మేరకు కొత్తగా ఏర్పాటైన పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించే దిశగా కార్యాచరణ రూపొందిస్తోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పరిశ్రమల శాఖకు తాజా లక్ష్యాలను ఇప్పటి వరకు నిర్దేశించలేదు. నూతన ఆర్థిక సంవత్సరంలో ఈ దిశగా ముందడుగు పడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం, అనుమతుల దిశగా మాత్రమే సమీక్షలు సాగుతున్నాయి. గత ఒప్పందాల అమలు, తాజాగా ముందుకొస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంపై సంబంధిత ఉన్నతాధికారులు ప్రస్తుతం దృష్టిసారించారు. కాకినాడతో పాటు రాజమహేంద్రవరం నగరంలో ఆటోనగర్‌లు, జిల్లా వ్యాప్తంగా 29 పారిశ్రామికవాడలు ఉన్నాయి. పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా సింగిల్ విండో విధానంలో నిర్ణీత కాలంలో అనుమతులు జారీ చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 177 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు కోరుతూ దరఖాస్తులు అందాయి. వీటిలో 166 అనుమతులు మంజూరు చేశారు. వివిధ కారణాలతో అయిదు దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలినవి వివిధ శాఖల అనుమతుల కోసం నిరీక్షిస్తున్నాయి. ఔత్సాహికులు ముందుకొస్తున్నా వారికి అవసరమైన భూమిని సమకూర్చడంలో ప్రస్తుతం ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ఏపీఐఐసీ ప్రతిపాదనలకు మోక్షం కలగక పోవడమే ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. పేదలకు ఇళ్ల పట్టాల అంశంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించడంతో ఏపీఐఐసీ స్థానికంగా భూమి సమకూర్చాలని అందించిన ప్రతిపాదనల్లో కదలిక లేకుండా పోయింది. ఉగాది నాటికి ఇళ్ల స్థల పట్టాల అంశం కొలిక్కి వస్తే పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిల్లాలో 64 భారీ పరిశ్రమలను రూ.17,715 కోట్లతో ఏర్పాటు చేయగా వీటిలో 31,663 మందికి ఉపాధి కల్పించారు. గతంలో 29 పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రూ.1,964.01 కోట్లతో కుదిరిన ఈ ఒప్పందాల్లో భాగంగా 1.49 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 10 పరిశ్రమలు రూ.819 కోట్లతో ఏర్పాటై ఉత్పత్తి ప్రారంభించాయి. వీటిలో 3,382 మందికి ఉపాధి కల్పించారు. ఈ ఏడాది నవంబరు 26 నాటికి జిల్లాలో పరిశ్రమల రాయితీ కింద జనరల్ కేటగిరీ పరిశ్రమలకు రూ.13.25 కోట్లు మంజూరు చేశారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ పారిశ్రామికవేత్తలకు రూ.4.96 కోట్లు మంజూరు చేశారు.మరోవైపు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజేపీ) కార్యక్రమంలో భాగంగా గత ఆర్థిక సంవత్సరంలో 179 పరిశ్రమలకు రుణాలు మంజూరు చేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 111 పరిశ్రమలకు రుణాలు ఇచ్చారు. వీటి ఏర్పాటు ద్వారా రెండు వేల మందికి పైగా ఉపాధి దక్కనుందని అధికారులు చెబుతున్నారు. ఏర్పాటైన పరిశ్రమల్లో 75 శాతం ఉపాధి అవకాశాలు స్థానికులకే కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రం యూనిట్‌గా ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలనూ జారీ చేసింది. పరిశ్రమలు ఏర్పాటైనచోట యువతకు ఆయా రంగాల్లో నైపుణ్యం లేకపోవడం వెలితిగా ఉండడంతో నైపుణ్యాభివృద్ధి శిక్షణల దిశగా కసరత్తు చేస్తున్నారు. డీఆర్‌డీఏ, పరిశ్రమల శాఖల ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతను ఈ మేరకు చైతన్యపరుస్తున్నారు. అపార అవకాశాలున్న జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. వ్యవసాయ ఉత్పతుల ద్వారా అధిక ఆదాయం దక్కక పోవడంతో పంట ఉత్పత్తులను శుద్ధి చేసి అదనపు హంగులు జోడిస్తే లాభసాటిగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో లీడ్‌బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో అన్ని డివిజన్లలో సదస్సులు ఏర్పాటు చేశారు. సుదీర్ఘ సాగరతీరం, వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలను పెంచవచ్చని భావిస్తున్నారు. గతంలో నిర్వహించిన సదస్సుల్లో 200 మంది వరకు సూక్ష్మ- చిన్న- మధ్యతరహా ఔత్సాహికులు పరిశ్రమల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇవి కార్యరూపం దాల్చితే మరింత మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.