YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

బ్రహ్మ సూత్రాలు

బ్రహ్మ సూత్రాలు

బ్రహ్మ సూత్రాలు
భారతీయ సంస్కృతికి మూలాధారం వేదాలు. ఈశ్వరీయమైన జ్ఞానాన్ని తపస్సంపన్నులైన రుషులు దర్శించి ప్రకటించారు. ప్రతి వేదంలో మూడు విభాగాలు ఉంటాయి. అవి సంహితలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు. తరవాత ఉపని షత్తులు వెలువడ్డాయి. రుషులకు చాలా సందేహాలుండేవి. భిన్నమైన అభిప్రాయాలుండేవి. వారి సందేహాలను తొలగించేందుకు అనేకచోట్ల నుంచి రుషులను పిలిపించి పెద్దసత్రాన్ని ఏర్పాటు చేశాడు వ్యాసుడు. భారీ యాగం జరిగింది. దాన్ని ‘సత్రయాగం’ అన్నారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలపాటు కొనసాగింది. ప్రతిరోజూ ఆరాధన అనంతరం రుషులు వేదాంతవిషయాలు చర్చించేవారు. వారివారి అభిప్రాయాలు విని ఆరణ్యకాలు, ఉపనిషత్తుల సారాన్ని జోడించి వేద వ్యాసుడు కొన్నిసూత్రాలు రూపొందించాడు. ఇందులో నాలుగు అధ్యాయాలు, 545 సూత్రాలు ఉన్నాయి. ఉపనిషత్తులు శ్రవణ ప్రధానమైతే, బ్రహ్మసూత్రాలు మనన ప్రధానమైనవి.సూత్రం అంటే దారం. ఉపనిషత్తుల్లోని వేదాంతవిషయాలు పుష్పాల్లాంటివైతే- సృష్టి, సృష్టికర్తలను గురించిన బ్రహ్మజ్ఞానాన్ని దర్శించే బ్రహ్మసూత్రాల సంపుటి ఒక పూలదారంలా సాక్షాత్కరిస్తుంది. పద్మపురాణంలో సూత్రం లక్షణాలు ఉన్నాయి. సంక్షిప్తం, సమగ్రం, విస్పష్టం అయి ఉండి దోషరహితంగా, పునరుక్తులు లేకుండా ఉండేది సూత్రం. వేదాధ్యయనం తరవాత బ్రహ్మను గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలుగుతుంది. ఈ భావాన్ని వ్యక్తం చేసే శ్లోకంతో బ్రహ్మసూత్రాలు ఆరంభమవుతాయి. సృష్టినిబట్టే సృష్టికర్తను గ్రహించాలని ప్రపంచ సృష్టికి బ్రహ్మే కర్త అని వ్యాసుడు చెప్పాడు. కపిలుడు సృష్టికి ప్రకృతే కారణమన్నాడు. పరమాణువులే కారణమన్నాడు కణాదుడు. అంతకుముందు ఈ ప్రపంచం లేదుగనుక అభావమే కారణమన్నారు బౌద్ధులు. దానిపాటికది సహజంగానే తయారైందన్నారు స్వభావవాదులు. వాటన్నింటినీ పూర్వపక్షం చేశారు బాదరాయణులు.చేతనమైన పరమాత్మే కారణమన్నప్పుడు నిమిత్తం, ఉపాదానం రెండూ కారణాలవుతాయి. నిమిత్తమంటే చేతనం. ఉపాదానమంటే అచేతనం. కార్యమైన కుండకు చేతనుడైన కుంభకారుడూ (కుమ్మరి) కారణమే. అచేతనమైన మట్టీ కారణమే. కనుకనే కార్యరూపమైన ప్రపంచానికి నిమిత్త, ఉపాదానాలు రెండూ కారణమే. రెండూ పరమాత్మే. అందుకే ప్రపంచానికి ఎంత అతీతమో అంత దగ్గరగా ప్రపంచంలో ప్రతి అణువూ మృత్తికలాగా వ్యాపించి ఉంది. ఇది వ్యాసులవారి సమన్వయం.బ్రహ్మ సూత్రాలకు ఎన్నో వ్యాఖ్యానాలు వెలశాయి. వాటికి అతి ప్రాచీన భాష్యం ఆదిశంకరులది. ఆ తరవాత యాదవప్రకాశ, భాస్కర, విజ్ఞాన, రామానుజ, నీలకంఠ, మధ్వ, వల్లభ, బల దేవాదుల రచనలు అవతరించాయి.శంకరుడి ప్రకారం సృష్టికర్త మాత్రమే సత్యం. సృష్టి ఒక మాయ మాత్రమే. సృష్టికర్తను గ్రహించడంవల్ల మాత్రమే సృష్టి మాయ అనే విషయం తేటతెల్లమవుతుంది. బ్రహ్మజ్ఞానం పొందకుంటే తీర్థయాత్రలు, పూజలు, దానాలు మొదలైనవి ముక్తిని ప్రసాదించలేవని శంకరుల భావన.రామానుజులు ఈ మాయా సిద్ధాంతాన్ని అంగీకరించలేదు. సృష్టికర్తలాగే ఈ ప్రపంచం కూడా సత్యమేనన్నారు.మధ్వాచార్యులు కూడా సృష్టి సత్యమేనంటూ అది సృష్టికర్త కన్నా భిన్నమైనదన్నారు. ఈ విధంగా బ్రహ్మసూత్రాలను అర్థం చేసుకుని వ్యాఖ్యానించడంలో భేదం గోచరిస్తుంది. బ్రహ్మజ్ఞానం మనిషిని పశువుల నుంచి మానవత్వానికి, మానవత్వం నుంచి దైవత్వానికి ఎదిగేలా చేస్తుంది. పరబ్రహ్మను ధ్యానిస్తూ, తమ మనసులను ప్రక్షాళన చేసుకున్నవారు అమృతత్వాన్ని, బ్రహ్మానందాన్ని పొందగలరు.

Related Posts