చంద్రయాన్ షురూ...
నెల్లూరు, డిసెంబర్ 18
చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పంపిన చంద్రయాన్-2 98 శాతం విజయవంతమైంది. అయితే, విక్రమ్ ల్యాండర్ సెప్టెంబరు 7న చంద్రుడిపై దిగుతూ ఉపరితలానికి కేవలం 750 మీటర్ల దూరంలో ఉండగానే హార్డ్ ల్యాండింగ్ అయింది. దీంతో భూ కేంద్రానికి ల్యాండర్‌కు సంబంధాలు తెగిపోయాయి. సంబంధాలు పునరుద్దరణకు ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తీవ్రంగా ప్రయత్నించాయి. కానీ, ల్యాండర్ దిగే క్రమంలో బలంగా ఉపరితలాన్ని తాకడంతో ముక్కలై దాని శకలాలు కిలోమీటర్ దూరం వరకూ చెల్లాచెదురయ్యాయి. ఇదిలా ఉండగా, చంద్రయాన్-3 ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోంది.చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలం కావడంతో చేపట్టబోయే ప్రయోగంలో ఎలాంటి లోపం తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోనుంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-2 ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించిన శాస్త్రవేత్త వనితను ఇస్రో తప్పించింది. అయితే, చంద్రయాన్-2 మిషన్ డైరెక్టర్‌గా పనిచేసిన రీతూ కరిధాల్‌ను మాత్రం తాజా ప్రాజెక్టులో కొనసాగిస్తున్నారు. వనిత స్థానంలో ఇస్రో ప్రధాన కార్యాలయంలో పనిచేసే పీ వీరముత్తువేల్‌ను నియమించారు. చంద్రయాన్-2 ప్రాజెక్టు మొత్తాన్ని వనిత నేతృత్వంలోని బృందం పర్యవేక్షించింది. అయితే, వనితను బదిలీ చేయడానికి అధికారిక కారణాలపై ఇస్రో ఎలాంటి ప్రకటన చేయలేదు.రీతు కరిధాల్‌ను మిషన్ డైరెక్టర్‌గా, వనితను చంద్రయాన్ -2 మిషన్ హెడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమిస్తూ ఇస్రో తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. కానీ, నవంబరు 28న వనితను బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. చంద్రయాన్-2 ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉన్న శాస్త్రవేత వనితను పేలోడ్, డేటా మేనేజ్‌మెంట్ అండ్ స్పేస్ ఆస్ట్రానమీ ఏరియా డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆమె స్థానంలో ఇస్రో ప్రధాన కార్యాలయంలో పనిచేసే సైంటిస్ట్ వీరముత్తువేల్‌ను చంద్రయాన్-3 ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమించినట్టు తెలిపింది.అలాగే డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్లు సభ్యులుగా ఉన్న ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ టీమ్ హెడ్‌గానూ వీరముత్తువేల్ ఉంటారని డిసెంబరు 7న జారీచేసిన ఉత్తర్వుల్లో వెల్లడించింది. చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించి వివిధ విభాగాలకు బాధ్యత వహిస్తున్న 29 మంది డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్లను గుర్తించిన ఇస్రో.. ల్యాండర్, రోవర్ విషయమై వీరి సేవలను వినియోగించునున్నారు. నవంబర్ 14 న చంద్రయాన్ -3 మిషీన్ పనులను ఇస్రో ప్రారంభించింది.