రాజధానిలో కాల్ మనీ కలకలం
గుంటూరు, డిసెంబర్ 18
ఏపీ రాజధాని ప్రాంతంలో మరోసారి కాల్‌మనీ దందా భయాందోళనకు గురిచేస్తోంది. వడ్డీకి వడ్డీ.. దానికి చక్రవడ్డీ పేరుతో వడ్డీ వ్యాపారులు వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తీసుకున్న అప్పుకు లక్షలకు లక్షలు వడ్డీలు కట్టినా వేధిస్తున్నారంటూ రెండు రోజుల కిందట ఓ యువకుడు తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ ఘటన మరువకముందే తాపీ మేస్త్రీ దంపతుల ఆత్మహత్య సంచలనంగా మారింది.కాల్‌మనీ వేధింపులు తాళలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. వడ్డీ వ్యాపారుల ఆగడాలు భరించలేక మంగళగిరి మండలం కాజ గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ పోలిశెట్టి పూర్ణచంద్రరావు, లక్ష్మి దంపతులు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన దయనీయ ఘటన కలచివేస్తోంది. అయితే చనిపోయే ముందు పూర్ణచంద్రరావు దంపతులు రాసిన లేఖ (సూసైడ్ లెటర్) ఇప్పుడు కంటతడి పెట్టిస్తోంది. వడ్డీ వ్యాపారుల దాష్టీకాలను కళ్లకు కట్టినట్లు పది పేజీల లేఖ రాయడం సంచలనంగా మారింది. కాల్‌మనీ రక్కసి కారణంగానే తాము ప్రాణాలు తీసుకుంటున్నట్లు విపులంగా రాసిన లెటర్ పోలీసులకు చేతికి చిక్కింది.పనుల్లేక ఇబ్బందులు పడుతున్న పూర్ణచంద్రరావు అప్పులపాలయ్యాడు. కేవలం రూ.30 వేలు అప్పు తీసుకున్నందుకు ఏకంగా లక్షన్నర.. ఇరవై వేల రూపాయలకు సుమారు లక్ష రూపాయలు కట్టాలని వడ్డీ వ్యాపారులు వేధింపులకు గురిచేయడంతో దిక్కుతోచని పరిస్థితిలో తనువు చాలించినట్లు తెలుస్తోంది. అధిక వడ్డీలు.. ఆ వడ్డీకి చక్ర వడ్డీలు కట్టి వ్యాపారులు బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. రూ.10 నుంచి రూ.15ల వడ్డీ వసూలు చేయడంతోపాటు దానికి చక్ర వడ్డీ వేసి కట్టాల్సిందేనని బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.కాల్‌మనీ వ్యాపారులు అధిక వడ్డీలు చెల్లించాలని వేధింపులకు గురిచేయడంతో పాటు ఇంట్లోని మహిళల పట్ల నీచంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. తాము చెప్పినంత డబ్బు చెల్లించకపోతే ఆడవాళ్లతో వ్యభిచారం చేయిస్తామని బెదిరించినట్లు సమాచారం. పూర్ణచంద్రరావు భార్య, కోడలు, ఆఖరికి చిన్నారి మనవరాలితో కూడా వ్యభిచారం చేయిస్తామని.. తమ డబ్బులు వసూలు చేసుకుంటామంటూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేయడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నట్లు సమాచారం.కాల్‌మనీ వేధింపులతోనే తాము బలవన్మరణం చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్న పూర్ణచంద్రరావు.. వేధింపులకు పాల్పడిన వారి పేర్లతో సహా బయటపెట్టినట్లు తెలుస్తోంది. తమ ఇంటి పక్కనే ఉండే మున్నీ, బూబమ్మ తమ చావుకు కారణమని.. వారి సాయంతో కాల్‌మనీ వ్యాపారులు బెదిరింపులకు పాల్పడినట్లు లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. మరో నలుగురి పేర్లు కూడా లేఖలో రాసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాల్‌మనీ వేధింపుల వ్యవహారంలో పోలీసుల ప్రమేయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరుకు చెందిన ఓ డీఎస్పీ కుమారుడినంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డారని.. పోలీసుల పేరుతో వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. మున్నీ, బూబమ్మతో పాటు డీఎస్పీ కొడుకుగా చెప్పుకుంటున్న వ్యక్తి.. అతనితోపాటు మరికొందరు పేర్లను సూసైడ్ లెటర్‌లో రాసినట్లుగా తెలుస్తోంది.డీఎస్పీ కొడుకుగా చెప్పుకున్న వ్యక్తి బౌన్సర్లతో వచ్చి బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.