నిర్భయ కేసు నిందితుడి రివ్యూ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ డిసెంబర్ 18,
నిర్భయ కేసులో దోషి అక్షయ్ తరపున దాఖలైన రివ్యూ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. దోషి అక్షయ్ రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సందర్భంలో ఉరిశిక్షపై పునఃసమీక్షించబోమని సుప్రీం త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసే యోచనలో దోషి అక్షమ్ తరపు న్యాయవాది ఉన్నట్లు తెలిసింది. 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్, హత్య కేసులో తనకు విధించిన మరణశిక్షను పునఃసమీక్షించాలంటూ అక్షయ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశాడు. మంగళవారం ఈ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే తప్పుకున్నారు. తన బంధువు ఒకరు ఇంతకు ముందు ఈ కేసును వాదించినందున తాను దీనిపై తీర్పు చెప్పలేనని ఆయన పేర్కొన్నారు. దీంతో జస్టిస్ ఆర్. భానుమతి నేతృత్వంలోని నూతన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఈ కేసుపై విచారణ చేపట్టింది. నిందితుడి తరపు లాయర్ డాక్టర్ ఏపీ సింగ్ వాదిస్తూ.. మరణ శిక్ష అనేది ప్రాచీనకాలం నాటి విధానమని పేర్కొన్నారు. ఈ శిక్షను అమలు చేయడం వల్ల నేరస్తుడు మరణిస్తాడు కానీ నేరం కాదని అన్నారు. మరణ శిక్ష విధించడం నేరగాళ్లు, దోషులను నిరోధించేలా ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పుకొచ్చారు. నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో తప్పుడు ఆధారాలతో విచారణ జరిపారని ఆరోపించారు. మీడియా, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి వల్లే తన క్లయింటును దోషిగా ప్రకటించారని ఏపీ సింగ్ పేర్కొన్నారు.
ధర్మాసనం జస్టిస్ లు మాట్లాడుతూ.. దోషికి సమీక్ష కోరే హక్కు లేదన్నారు. త్వరలో నిర్భయ దోషులకు ఉరి శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. '' రివ్యూ పిటిషన్ వేయడానికి నలుగురు దోషులు అనర్హులు.. రివ్యూ పిటిషన్ వేయడానికి ఎందుకొచ్చారు. వీరిపై ఎలాంటి దయాదాక్షిణ్యాలు చూపాల్సిన అవసరం లేదు. '' అని అభిప్రాయపడ్డారు. రివ్యూ పిటిషన్ ను తిరస్కరించారు