నా భూమి ఇంత మీకే ఇచ్చేస్తా : భరత్
విశాఖపట్టణం, డిసెంబర్ 18,
ఏపీకి మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన హీట్ పెంచుతోంది. సీఎం ప్రకటనపై అమరావతి రైతులు భగ్గమంటుంటే.. టీడీపీ కూడా ఈ ప్రకటనను వ్యతిరేకిస్తోంది. దీనిపై హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య అల్లుడు, విశాఖ టీడీపీ నేత భరత్ స్పందించారు. రాజధాని విషయంలో సౌతాఫ్రికాకు.. ఏపీకి లింకేంటని ప్రశ్నించారు. అసలు ఆ పోలిక సరికాదని.. రాజకీయ అవసరాల కోసం అక్కడ మూడు చోట్ల రాజధానులు ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. రాజధాని విషయంలో దక్షిణాఫ్రికా గురించి మాట్లాడేప్పుడు.. అక్కడ అభివృద్ధి ఎలా ఉందో కూడా గమనించాలన్నారు.విశాఖ టీడీపీ హయాంలోనే ఆర్థిక రాజధానిగా ప్రకటించారని గుర్తు చేశారు భరత్. నగరం బాగుపడితే మంచిదని.. తాను కూడా ఆనందిస్తానన్నారు. కానీ రాజధాని పేరుతో రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదంటున్నారు. అమరావతిలో కూడా రైతులు 35వేవల ఎకరాల భూమిని ఇచ్చారని.. పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ముందుకు వచ్చారని గుర్తు చేశారు. అలాంటి వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.ఇక అమరావతిలో తమకు 500 ఎకరాల భూములు ఉన్నాయన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు భరత్. నిరూపించాలని గతంలోనే తాను సవాల్ చేశానని.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు. ఒకవేళ భూమి ఉంటే ఫ్రీగా ఇచ్చేస్తామని తాను గతంలోనే చెప్పానన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తమపై బురదజల్లే ప్రయత్నం చేశారన్నారు.