ఘనంగా భవాని దీక్ష విరమణలు
ఇంద్రకీలాద్రి డిసెంబర్ 18
బుధవారం నాడు ఇంద్రకీలాద్రి లో భవానీ దీక్షావిరమణలు అత్యంత వైభవముగా ప్రారంభయ్యాయి. మొదటి రోజు ఉదయం అమ్మవారి దర్శనము ప్రారంభమయి, ఆలయ స్థానాచార్యులు విష్ణు భట్ల శివ ప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు వారి ఆధ్వర్యములో శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గా అగ్ని ప్రతిష్ఠాపన చేసి, 3 హోమగుండములు వెలిగించారు. అనంతరం ప్రారంభించిన చండీయాగం నందు ఆలయ కార్యనిర్వహణాధికారి దంపతుల వారు పాల్గొని అత్యంత భక్తీ శ్రద్దలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమములో ఆలయ కార్యనిర్వహణాధికారి వారితో పాటు ఆలయ వైదిక కమిటీ సభ్యులు లింగంబోట్ల దుర్గాప్రసాద్, కోట ప్రసాద్, ఆర్.శ్రీనివాస శాస్త్రి, ఇతర అర్చక సిబ్బంది పాల్గొన్నారు. భక్తులు వినాయక గుడి నుండి ప్రారంభమయ్యే క్యూలైన్లు ద్వారా ఘాట్ రోడ్ మీదుగా దేవస్థానము చేరుకొని, అమ్మవారిని దర్శించుకొని, శివాలయము మెట్ల మార్గం ద్వారా క్రిందకి చేరుకుని, హోమగుండం ఎదురుగా ఏర్పాటు చేసియున్న ఇరుముడి పాయింట్లులో ఉన్న అర్చక స్వాములు, గురుభవానీల వద్ద భక్తులు ఇరుముడులు సమర్పించి, ముడుపులు, కానుకలు హుండీ లలో సమర్పించి దీక్షా విరమణలు చేసారు. భక్తులకు శ్రీ అమ్మవారి దర్శనము ఆనంతరము పులిహోరను పంచిపెట్టారు. భవానీ దీక్ష విరమణల సందర్భముగా ఈ నెల ఇరవై ఆరవ తేదీవరకు దేవస్థానంలో నిర్వహించే అన్ని ఆర్జిత సేవలు నిలిపివేసారు.