ధాన్యం.. సొమ్ములు జాప్యం (కృష్ణాజిల్లా)
మచిలీపట్నం, డిసెంబర్ 18జిల్లాలో ధాన్యం రైతులకు సొమ్ములు జమకావడం లేదు. గత రబీసీజన్‌లో ఉత్పన్నమైన పరిస్థితే ఎదురవుతోంది. ఖజానా ఖాళీకి తోడు సాంకేతిక సమస్యలు రైతుల పాలిట కష్టాలుగా మారాయి. జిల్లాలో ధాన్యం సేకరణ ప్రారంభమై దాదాపు 20 రోజులు గడిచింది. అధికారుల లెక్కల ప్రకారం కేవలం రూ.11కోట్లు మాత్రమే జమ చేశామంటున్నారు. కానీ సాంకేతికంగా మాత్రం రైతులకు ఇంకా అందలేదు. సాధారణంగా డిమాండు ఉంటే నేరుగా మిల్లర్లకు అమ్ముకొనే అవకాశం రైతులకు ఉండేది. కానీ ఈ ఏడాది నేరుగా మిల్లర్లకు విక్రయించవద్దనే నిబంధన విధించారు. దీంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రధానంగా తేమ పేరుతో రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ధాన్యంలో తేమ శాతం 17 కు మించరాదనే నిబంధన ఉంది. ఆలోపు ప్రమాణాలకు లోబడి ఉంటేనే మద్దతు ధర ఇస్తారు. ప్రస్తుతం రైతులే తప్పని సరిగా ఆరబెట్టి తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల వాతావరణ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేశాయి. వర్షం వస్తే ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. కాటా లారీలు రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సారి నాణ్యమైన బియ్యం పౌరసరఫరాలకు అందించాలనే లక్ష్యంతో అధికారులు తేమ విషయంలో రాజీ పడటం లేదు. నాణ్యమైన బియ్యం వచ్చేందుకు సార్టెక్సు యంత్రాలను మిల్లులు ఏర్పాటు చేసుకోవాలని సంయుక్త కలెక్టర్ మాధవీలత సూచించారు. జిల్లాలో మొత్తం 113 మిల్లుల్లో ఈ యంత్రాలను అమర్చారు. నూక లేని పాలిష్ ఎక్కువగా ఉన్న బియ్యం దీనివల్ల వస్తాయి. పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసిన ధాన్యం మిల్లర్లకు అందిస్తే వారు ధాన్యం ఆడించి బియ్యం అందిస్తారు. దీన్నే సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యంగా పిలుస్తారు. క్వింటా ధాన్యం ఆడిస్తే 65 కేజీల వరకు బియ్యం ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం సార్టెక్సు యంత్రం వల్ల దీన్ని 60 కేజీలకు తగ్గించనున్నట్లు తెలిసింది. ఇక తేమ ఎక్కువగా ఉన్న ధాన్యం డ్రయ్యర్లు ఉన్న మిల్లుల్లో ఆరబెట్టి ఆమేరకు మిల్లింగ్ చేయాల్సి ఉంది. కానీ అసలు తేమ పేరుతో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కానీ ధాన్యం సేకరణ చాలా నెమ్మదిగా సాగుతోంది. కొన్ని కేంద్రాల్లో ఊపందుకోలేదు. మొత్తం 264 కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు కేవలం 25 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. గతంలో జరిగిన లోపాలను సరిదిద్దే ఉద్దేశంతో ఈక్రాప్ నిబంధన పెట్టారు. ఇతర జిల్లాలకు తరలించకూడదని, నేరుగా మిల్లర్లకు విక్రయించకూడదని నిబంధనలు పెట్టారు. ప్రతి పీపీసీ కేంద్రం వద్ద కంప్యూటర్ ఏర్పాటు చేసి అంతర్జాలం సౌకర్యం కల్పించారు. అయితే సర్వర్ పనిచేయడం లేదని చెబుతున్నారు. నెట్‌వర్క్ సమస్యతో త్వరగా అంతర్జాలంలో ఈక్రాప్ సరిపోలడం లేదు. దీంతో జాప్యం జరుగుతోంది.