ఏడు నెలల వయస్సులో మేయర్
న్యూయార్క్, డిసెంబర్ 19 /> ఏడు నెలల పసివాడు బోసి నవ్వులు నవ్వుతూ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశాడు. అధికారులు, స్థానికులతో నిండిపోయిన ఆ హాల్‌లో అందరినీ చూస్తూ సంతోషంతో కేరింతలు కొట్టాడు. పసివాడు.. మేయర్‌గా ఎన్నికవ్వడం ఏమిటీ మరీ విడ్డూరం కాకపోతే అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. అతడు నిజంగానే మేయర్ అయ్యాడు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం.వైట్‌హాల్ ప్రాంతానికి చెందిన విలియం చార్లెస్ (చార్లీ) అనే ఏడు నెలల పసివాడు గ్రిమ్స్ కౌంటీకి మేయర్‌గా ఎన్నికయ్యాడు. అమెరికా చరిత్రలో అతి పిన్న వయస్సు గల మేయర్‌గా రికార్డులకు ఎక్కాడు. వైట్‌హాల్ వాలంటీర్ ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన బీబీక్యూ ఫండ్ రైజర్ ఆధ్వర్యంలో ఏటా గ్రిమ్స్ కౌంటీ మేయర్ పదవి కోసం వేలం పాట నిర్వహిస్తారు. ఇందులో ఎవరైతే బిడ్‌ను గెలుచుకుంటారో వారికి మేయర్ పదవి లభిస్తుంది. ఎన్నికైన వ్యక్తులు ఏడాదిపాటు ప్రజలకు సేవలందిస్తారు. ఈ నేపథ్యంలో చార్లీ తల్లిదండ్రులు వేలం పాటలో పాల్గొన్నారు. మేయర్ పదవికి తన కుమారుడి పేరును ప్రతిపాదించారు. వైట్‌హాల్ కమ్మునిటీ సెంటర్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 150 మంది అతిథులు పాల్గొన్నారు. క్యూట్ క్యూట్ నవ్వులతో మేయర్ వస్త్రాల్లో మెరిసిన చార్లీని చూసి అంతా మురిసిపోయారు. అంతా ఇప్పుడు ఆ పసివాడిని మేయర్ చార్లీ అని పిలుస్తున్నారు. మేయర్ పోడియంలో ఉండేందుకు కేవలం చార్లీ తల్లిదండ్రులు చాద్, నాన్సీ మెక్ మిల్లన్‌కు మాత్రమే ఉంది. మేయర్ తరఫున వారే పాలనా బాధ్యతలు నిర్వహిస్తారు.