YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

జగన్ గురిపెట్టి... సెటిల్ చేసేశారు...

జగన్ గురిపెట్టి... సెటిల్ చేసేశారు...

జగన్ గురిపెట్టి... సెటిల్ చేసేశారు...
విజయవాడ, డిసెంబర్ 19
కొత్త ప్రభుత్వం ఏర్పడకముందు అమరావతిలో సెంటు భూమి ఎవ్వరు కొనలేని పరిస్థితి రాజ్యమేలింది. అయితే వైసిపి సర్కార్ కొలువుతీరడం రాజధానిపై తమ వైఖరిని నెమ్మది నెమ్మదిగా వెల్లడిస్తూ రావడంతో అమరావతిలో భూములు నేలచూపులు చూస్తూ వస్తున్నాయి. అమ్మేవాళ్ళు వున్నా కొనేవాళ్ళు కనిపించే పరిస్థితి లేదు. జగన్ సర్కార్ వైఖరి పూర్తిగా తెలుసుకున్నాకే భూములు ప్లాట్ లు కొనుగోలు చేయవచ్చని హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన ఉద్యోగుల్లో ఎక్కువమంది అద్దె ఇళ్లకే పరిమితం అయ్యారు. చాలామంది పిల్లల చదువుల కోసం హైదరాబాద్ లోని ఆస్తిపాస్తులను వదులుకునేందుకు ఇష్టం లేక విజయవాడ వాతావరణానికి సెట్ కాలేక కుటుంబాలను వదిలి అటు ఇటు తిరుగుతూనే ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కొంత కాలంగా చేస్తూ వచ్చిన సంచలన ప్రకటనలను అసెంబ్లీ సాక్షిగా జగన్ నిజమేనని వెల్లడించడంతో గందరగోళం తొలగిపోయింది. సచివాలయం కేంద్రంగా ఉద్యోగాలు చేయాలిసిన వారంతా ఇక విశాఖ వైపు చూసే పరిస్థితి ఏర్పడింది.అందమైన సముద్ర తీరం రోడ్డు, రైలు, విమాన, నౌక సౌకర్యాలతో అలరారే విశాఖపట్నం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి ఆర్ధిక రాజధానిగా భాసిల్లుతోంది. అన్ని కనెక్టివిటీలు ఉన్నప్పటికీ ఏపీ లోని ఐదు జిల్లాలు తప్ప మిగిలిన 8 జిల్లాలకు దూరంగా ఉందనే పేరుతప్ప ఒక రాజధాని కి కావలిసిన అన్ని హంగులు విశాఖకు ఉన్నాయని నిపుణులు ఎప్పుడో స్పష్టం చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రధాన కేంద్రం కావడం కూడా ఆ ప్రాంత అభివృద్ధికి జగన్ సర్కార్ సరైన నిర్ణయం తీసుకుందన్న మాట అక్కడి ప్రజల నుంచి వినవస్తుంది. వైఎస్ జగన్ తన మనసులో మాట ఇప్పటికి బయటపెట్టారని ఆయన నియమించిన కమిటీ కూడా అదే చెబుతుందని ఎక్కువ మంది భావిస్తున్నారు. చుట్టూ పరిశ్రమలు ఉండటంతో విశాఖలో ఇప్పటికే భూముల ధరలు చుక్కలు అంటుతున్నాయి. జగన్ ప్రకటన తో ఇవి ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. భోగాపురం లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పడితే పూర్తి స్థాయి రాజధాని గా విశాఖే ఉండొచ్చోని భావిస్తున్నారు.విశాఖపట్నం అభివృద్ధికి అమెరికా ఎప్పుడో ముందుకు వచ్చింది. నగరాన్ని మరింత తీర్చిదిద్దేందుకు అవసరమైన సాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని సైతం కుదుర్చుకుంది. హుద్ హుద్ తుఫాన్ తరువాత విశాఖలో భూగర్భ విధ్యుత్ లైన్ల పనులు వేగవంతంగా పూర్తి అవుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా విశాఖ కు రైల్వే జోన్ ప్రకటించింది. గత ప్రభుత్వం నుంచి జగన్ సర్కార్ దాకా పెట్టుబడుల ఆకర్షణకు విశాఖ వేదికగానే భాగస్వామ్య సదస్సులు జరుగుతూ వస్తున్నాయి. స్టీల్ ప్లాంట్, ఆయిల్ పరిశ్రమలు విశాఖ కేంద్రంగా విస్తరిస్తున్నాయి. భారత నావికాదళ వ్యూహాత్మక కేంద్రాల్లో అతిముఖ్యమైంది విశాఖ కావడంతో కేంద్రం తప్పనిసరిగా అభివృద్ధికి ఇక్కడ ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి. ఇవన్నీ ఆలోచించే జగన్ సర్కార్ సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Posts