YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

 రిటైర్డ్ ఉద్యోగులతోనే హెచ్ ఎండీఏ

 రిటైర్డ్ ఉద్యోగులతోనే హెచ్ ఎండీఏ

 రిటైర్డ్ ఉద్యోగులతోనే హెచ్ ఎండీఏ
హైద్రాబాద్, డిసెంబర్ 19, 
హెచ్‌ఎమ్‌డీఏలో సుదీర్ఘకాలం పనిచేసి, రిటైర్డ్‌ అయిన అధికారులకు పదోన్నతులు కల్పించి, ఉన్నత పోస్టుల్లో నియమించిన ఘనత ఇక్కడి అధికారులకే దక్కుతుంది. వారికి వచ్చే పెన్షన్‌కు అదనంగా లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారు. రిటైర్డ్‌ అయ్యాక డైరెక్టర్లు అయిన అధికారులూ ఉన్నారు. సంస్థలో 125 మంది సిబ్బంది ఉంటే వారిలో 45 మంది డిప్యుటేషన్‌పై ఉన్నవారే. సెక్రటరీతో పాటు చీఫ్‌ ఇంజనీర్‌, డైరెక్టర్‌ ప్లానింగ్‌-2, చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్లు కూడా రిటైర్డ్‌ అయ్యాక పదోన్నతులపై ఆ సీట్లలోకి వచ్చినవారేనని ఇక్కడి సిబ్బంది చెప్పుకుంటున్నారు.హెచ్‌ఎమ్‌డీఏ ఎల్‌ఆర్‌ఎస్‌ మేళా తంతుగా మారింది. తార్నాకలోని ఆ కార్యాలయ భవనం రెండో అంతస్తులో ఈ మేళాను నిర్వహిస్తున్నారు. రెండేండ్లుగా వివిధ ప్రభుత్వ శాఖల కొర్రీలతో నిలిచిపోయిన దరఖాస్తులకు మోక్షం లభిస్తుందేమో అనే ఆశతో వస్తే...'మేమేం చేయలేం' అనే సమాధానమే లభిస్తున్నది. అత్యధికంగా రెవెన్యూశాఖ నుంచి రావల్సిన ఎన్‌ఓసీదరఖాస్తుదారులకు అందలేదు. దీనిపై పరిష్కారం చెప్పండని వెళ్తే...'అది రెవెన్యూ మేటర్‌...మాకేం సంబంధం లేదు' అని అక్కడి సిబ్బంది చెప్తున్నారని దరఖాస్తుదారులు మొత్తుకుంటున్నారు. ఎన్‌ఓసీలు ఇవ్వాలని హెచ్‌ఎమ్‌డీఏ ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపిన ఆన్‌లైన్‌ దరఖాస్తుల జాబితా కూడా తప్పుల తడకగా ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తుల వివరాలే లేవని పలువురు దరఖాస్తుదారులు అక్కడి సిబ్బందితో వాగ్వివాదాలకు దిగుతున్నారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఎన్‌ఓసీల కోసం వందల సంఖ్యలో పెండింగ్‌ దరఖాస్తులు ఉన్నాయి. ఎన్‌ఓసీ ఇస్తారో...లేదో కూడా స్పష్టత ఇవ్వట్లేదని దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల సంచలనం కలిగించిన అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయం పరిధిలోనే దాదాపు 4వేలకు పైగా ఇలాంటి పెండింగ్‌ దరఖాస్తులు ఉన్నట్టు హెచ్‌ఎమ్‌డీఏ వెబ్‌సైట్‌లో ఉన్నదని అక్కడి సిబ్బంది తెలిపారు.ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం హెచ్‌ఎమ్‌డీఏకు రెండేండ్ల క్రితమే డబ్బులు కట్టిన దరఖాస్తుదారులు రెవెన్యూ, హెచ్‌ఎమ్‌డీఏ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మేళాలో ఈ సమస్యలకు ఏదైనా పరిష్కారం లభిస్తుందేమో అనే ఆశతో వస్తే...''మీరు ఎన్‌ఓసీ తెస్తేనే...మేం ఏమైనా చేస్తామని'' అధికారులు సమాధానం చెప్తున్నారు. అలాగే నాలా ఛార్జీలు అధికమొత్తంలో వచ్చాయని, ఓసారి వెరిఫై చేయాలని కోరితే..''అది సిస్టం జనరేటెడ్‌ ఫీజు. ఆ మొత్తం కట్టాల్సిందే'' అని సమాధానాలు చెప్తున్నారు. మేళాలో ప్రత్యేకంగా ఎలాంటి సమాచారం, సహకారం లేవు. సాధారణంగా హెచ్‌ఎమ్‌డీఏ ఆన్‌లైన్‌లో ఉండే సమాచారమే మేళాలో ముఖాముఖి చెప్తున్నారు. ఏవైనా సందేహాలు, ప్రశ్నలు అడిగితే...''అవన్నీ మాకు తెలీదు'' అనే సమాధానమే వస్తున్నది. దీనితో 'ఇంతదూరం అనవసరంగా వచ్చాం' అని అధికారులపై విసుక్కుంటూ దరఖాస్తుదారులు తిరిగి వెళ్తున్నారు.దాదాపు 7వేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న హెచ్‌ఎమ్‌డీఏలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల క్లియరెన్స్‌ కోసం కేవలం 20 మంది సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. పోలీ సులు, ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బందే ఎక్కువగా ఉన్నారు.మరో 20 మంది రిటైర్డ్‌ తహసీల్దార్లు కూడా ఇక్కడే పునరావాసం పొందుతున్నారని చెప్తున్నారు. '''జీవితంలో సెటిల్‌ అయిపోయి, జీతంతో టైంపాస్‌ చేస్తూ ఇక్కడ కూర్చున్నవారికి మా లాంటి వాళ్ల కష్టాలు ఎలా తెలుస్తాయి?'' అంటూ కడుపుమండిన ఓ దరఖాస్తుదారుడు విసుక్కుంటూ వెళ్లిపోయారు. షార్ట్‌ఫాల్‌ ఉన్న ఫైల్స్‌కు ఇక్కడ ఎలాంటి పరిష్కారం లభించట్లేదని, అన్నీ ఉంటే మేళాకు రావాల్సిన అవసరం ఏంటని మరో దరఖాస్తుదారుడు ప్రశ్నించడం కనిపించింది. కేవలం రికార్డుల కోసమే మేళా నిర్వహిస్తున్నారనీ, దీనివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని దరఖాస్తుదారులు అభిప్రాయపడుతున్నారు.

Related Posts