రాజధానికి విశాఖ అనువైనది
విశాఖపట్నం డిసెంబర్ 19,
విశాఖ జిల్లాను ఎగ్జిక్యూటివ్ క్యాపిటెల్ గా ప్రకటించడంపై వైసీపీ నేతలు ప్రభుత్వ చిత్తశుద్దిపై హర్షిస్తున్నారు. భోగాపురం వరకు విస్తరించి ఉన్న విశాఖ రాజధానికి అనువైనదని వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ అన్నారు.ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను చేస్తే మూడు జిల్లాల అభివృద్ది కూడా జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని పేరిట డబ్బులు వృథా చేయకూడదన్న ఉద్దేశంతోనే మూడు ప్రాంతాల అభివృద్దికి ప్రతిపాదనలు చేశారని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిలిపివేయడం సరికాదన్నారు. విశాఖను సమ్మర్ రాజధానిగా చేయాలని గతంలో తాము చేసిన ప్రతిపాదనల దృష్ట్యా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉత్తరాంధ్ర ప్రజల కలను నెరవేర్చారని అన్నారు.
సీఎం జగన్ ఉత్తి ఆంధ్రను ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దనున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు విమర్శించి ప్రజల గౌరవాన్ని కోల్పోయారని, ఒకే ప్రాంతానికి, వర్గానికి మేలు చేకూరేలా వీరిద్దరి ఆలోచనలు ఉన్నాయని విమర్శించారు. పార్టీలను నడిపే హక్కు చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌లకు లేదని, రాజధాని విషయంలో చంద్రబాబు శవ రాజకీయాలు చేయాలని కలలు కంటున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ నిర్ణయంతో విశాఖ నగరం హైదరాబాద్ స్టాయిలో అభివృద్ది చెందనుందని, అమరావతి భూముల విషయంలో జరిగినట్టు విశాఖలో అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు.