YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు !!

ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు !!

 ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఒంటిమిట్టలో నూతనంగా నిర్మించిన యాత్రికుల వసతి సముదాయంలో శుక్రవారం సాయంత్రం కడప జిల్లా అధికారులు, టిటిడి అధికారులతో ఈవో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 24 నుండి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తికావచ్చాయని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టామన్నారు. మార్చి 30వ తేదీన జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి గౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులను ఆహ్వానించినట్టు వెల్లడించారు. కల్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశముండడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేపడుతున్నట్టు తెలిపారు. భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు టిటిడి అధికారులకు విధులు కేటాయించినట్టు చెప్పారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఉదయం, సాయంత్రం అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు.

గతేడాదితో పోలిస్తే ఈసారి అదనంగా అన్నప్రసాద వితరణ కౌంటర్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాట్టు చేస్తున్నామని ఈవో వివరించారు. అన్నప్రసాద వితరణ కౌంటర్లు 100 నుండి 200లకు, తాత్కాలిక మరుగుదొడ్లను 100 నుండి 230కి, తాగునీటి ప్యాకెట్లు 4 లక్షల నుండి 6 లక్షలకు పెంచామని వెల్లడించారు. అలాగే 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామని, కల్యాణవేదికకు నాలుగువైపులా వైద్యశిబిరాలు ఏర్పాటుచేస్తామని చెప్పారు. జిల్లా ఎస్‌పితో సమన్వయం చేసుకుని సిసి కెమెరాల ఏర్పాటుతోపాటు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేస్తామన్నారు. 1200 మంది శ్రీవారి సేవకులు, 800 మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ భక్తులకు సేవలందిస్తారని తెలిపారు. కల్యాణాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయడంతోపాటు భక్తులందరూ వీక్షించేందుకు వీలుగా 15 హెచ్‌డి డిస్‌ప్లే స్క్రీన్లు ఏర్పాటు చేస్తామన్నారు.

అంతకుముందు సమావేశంలో ఈవో మాట్లాడుతూ ఆలయం, పరిసర ప్రాంతాలు, కల్యాణవేదిక వద్ద శోభాయమానంగా విద్యుద్దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని ఆదేశించారు. మార్చి 30వ తేదీన జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి వేలాది మంది భక్తులు విచ్చేసే అవకాశముందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు 350 మంది పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. భక్తులకు సమాచారం, సూచనలిచ్చేందుకు రేడియో, బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ద్వారా ఎప్పటికప్పుడు ప్రకటనలు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల వాహనసేవల్లో మెరుగైన కళాబృందాలను ఏర్పాటు చేయాలని టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ అధికారులను ఈవో ఆదేశించారు. విభాగాల వారీగా సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.

సమావేశం అనంతరం కల్యాణవేదిక ప్రాంగణాన్ని జిల్లా అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు. భక్తులు ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు వేరువేరుగా మార్గాలు ఏర్పాటుచేయాలన్నారు. కల్యాణవేదికను సంప్రదాయబద్ధంగా అలంకరించాలని సూచించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి ఇంజినీరింగ్‌ అధికారులకు పలు సూచనలు చేశారు.

ముందుగా ఆలయం వద్దకు చేరకున్న ఈవోకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్‌ శ్రీ మేడా మల్లికార్జునరెడ్డి, కడప జిల్లా కలెక్టర్‌ శ్రీటి.బాబురావు నాయుడు, టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, జిల్లా ఎస్‌పి శ్రీ ఎ.బాబుజి, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీఎన్‌.ముక్తేశ్వరరావు, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీహరీంద్రనాథ్‌, ఇతర అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Related Posts