స్త్రీ నిధి సంస్థ మహిళలకు వడ్డీలేని రుణాలు: మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్ డిసెంబర్ 19
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ 8వ సర్వసభ్య సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్త్రీ నిధి సంస్థ మహిళలకు వడ్డీలేని రుణాలు సులభంగా, పారదర్శకంగా అందించేందుకు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో భాగంగా మా స్త్రీ నిధి యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేడు ఆవిష్కరించారు. రుణం తీసుకున్న సంఘం సభ్యులు తిరిగి చెల్లించేందుకు, ఎంత కట్టాల్సి ఉందో చూసుకునేందుకు, డబ్బులు నేరుగా అర్హులకు అందించేందుకు, ఏ అవసరానికి ఎంత మొత్తం రుణం ఇస్తారో తెలుసుకునేందుకు.. మా స్త్రీ నిధి యాప్ ఉపయోగపడుతుంది.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. నేటి పరిస్థితుల్లో మార్కెట్‌లో లభించే నిత్యావసర వస్తువులన్నీ కల్తీమయం అయ్యాయి. వీటిని ఆహారంగా తీసుకుంటూ ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. వీటికి చెక్ పెడుతూ మహిళా స్వయం సహాయక సంఘాలే కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి వంటి ఇతర నిత్యావసర వస్తువులను తయారు చేయాలన్నారు. కల్తీ లేని పదార్థాలు మహిళా సంఘాల వద్దే లభిస్తాయని ప్రజలు విశ్వసించేలా వస్తువులను తయారు చేయాలన్నారు. రుణాలు పొందిన మహిళలు బయట ఇతరులకు వడ్డీలకు ఇవ్వకుండా స్వయం సమృద్ధి సాధిస్తూ ఆర్థికంగా బలోపేతం కావాలని మంత్రి పేర్కొన్నారు.