సమత కేసులో సాక్ష్యాలు కరువు
అదిలాబాద్, డిసెంబర్ 19,
సమత హత్యాచార కేసుపై రోజువారి విచారణ ఆదిలాబాద్‌లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో జరుగుతోంది. అయితే, నిందితుల తరఫు న్యాయవాది రహీం.. డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేయడంతో.. నిందితులతో మాట్లాడేందుకు కోర్టు ఆయనకు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో సమత కేసులో నిందితులు తమ నేరాన్ని అంగీకరించక పోవడం గమనార్హం. పైగా పోలీసులే తమపై తప్పుడు కేసులు బనాయించి, అరెస్టు చేశారని కోర్టుకు తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో వారే నిందితులని నిరూపించేలా పక్కా పటిష్ఠమైన ఆధారాలు సంపాదించడం పోలీసులకు సవాలుగా మారింది.ఈ ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం కూడా విచారణ చేపట్టగా.. తాము ఎలాంటి నేరం చేయలేదని నిందితులు కోర్టుకు చెప్పారు. బాధితులు, నిందితుల తరపున వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఏ-1గా షేక్ బాబు (30), ఏ-2గా షేక్ షాబొద్దీన్ (40), ఏ-3గా షేక్ ముఖ్దుం(30)లు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ ముగ్గురు నిందితులు గత నెల 24న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్ గ్రామం సమీపంలో ‘సమత’ అనే గిరిజన మహిళపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారు. హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటనకు కొద్దిరోజుల ముందే ఈ అమానుషం జరిగింది.