రణరంగంగా మారిన ఎర్రకోట
న్యూఢిల్లీ, డిసెంబర్ 19,
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ మరోసారి అట్టుడికింది. చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో అక్కడ రణరంగంగా మారింది. సీఏఏకు నిరసనగా వామపక్షాల నేతృత్వంలోని ఎర్రకోట వద్ద భారీ కవాతుకు పిలుపునిచ్చారు. అయితే దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ముందు జాగ్రత్త చర్యగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినా దానిని లెక్కచేయకుండా వేలాది మంది నిరసనకారులు ఎర్రకోట వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు ఆందోళనల దృష్ట్యా ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి, నగరానికి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీంతో ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దులో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ దారిలో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. అలాగే 13 మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేసి, ఆయా స్టేషన్లలో మెట్రో రైళ్లు ఆగవని ప్రకటించారు. గత పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎర్రకోట వద్ద లాఠీఛార్జిని నిషేధించారు.ఇదిలా ఉండగా, రిలయన్స్ జియో, వొడాఫోన్, ఎయిర్‌టెల్ మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశాయి. ప్రభుత్వ వర్గాల నుంచి అందిన ఆదేశాలతో కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్, వాయిస్, ఎస్ఎంఎస్ సర్వీసులను నిలిపివేశామని ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఈశాన్య, మధ్య ఢిల్లీలో వాట్సాప్, ట్విట్టర్ ద్వారా వస్తున్న సమాచారంతో పెద్ద ఎత్తున ఆందోళనకారులు చేరుకుంటున్నారనే ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారంతో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయాలని టెలికం సంస్థలను ఢిల్లీ పోలీసులు కోరారు. దీంతో ఆయా సంస్థలు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశాయి.ఎర్రకోట ఘటనపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్విట్టర్‌లో స్పందించారు. ‘మెట్రో స్టేషన్లు మూసేశారు.. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశఆరు.. ప్రతిచోట 144 సెక్షన్ విధించారు.. తమ గళం వినిపించడానికి ప్రజలకు చోటేలేకుండా పోయింది.. ప్రజలకు అవగాహన కల్పించడానికి జనం చెల్లిస్తున్న పన్నుల్లోని కోట్లాది రూపాయలను ప్రకటనల కోసం ఖర్చు చేసినవారు.. అదే ప్రజల గొంతును అణచివేస్తున్నారు’ అని ప్రియాంక మండిపడ్డారు.